Share News

జూలై 5నే ‘భోగాపురం’ ప్రారంభం!

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:34 AM

భోగాపురంలో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి జీఎంఆర్‌ గ్రూపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ‘ప్రారంభ తేదీ’పై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేకున్నా...

జూలై 5నే ‘భోగాపురం’ ప్రారంభం!

  • కొనసాగుతున్న ట్రయల్‌ రన్‌

  • విశాఖలో తొమ్మిది చోట్ల వెయిటింగ్‌ లాంజ్‌లు

  • దేశంలోనే తొలిసారి ఏర్పాటు... తొలి విడతలో ఐదు

  • ముంబై నుంచి రానున్న కంటెయినర్లు

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి జీఎంఆర్‌ గ్రూపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ‘ప్రారంభ తేదీ’పై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేకున్నా... అక్కడ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురుయ్యే ఇబ్బందుల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్‌ విమాన ప్రయాణికుల సంఘం(అపాటా) చేసిన సూచనలకు జీఎంఆర్‌ యాజమాన్యం స్పందించింది. విమాన ప్రయాణికులంతా సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్‌ మరింత జటిలం అవుతుందని, నగరంలో పలుచోట్ల బిజినెస్‌ కమ్‌ వెయిటింగ్‌ లాంజ్‌లు పెట్టాలని అపాటా కోరింది. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇందుకోసం జీఎంఆర్‌ గ్రూపు ముంబైలో ప్రత్యేకంగా కంటెయినర్లను తయారు చేయిస్తున్నది. 40 అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవు కలిగిన కంటెయినర్లు ప్రాథమికంగా ఐదు తీసుకువస్తున్నది. వాటిని నగరంలో ఎంపిక చేసిన బస్టాపుల్లో ఉంచి ఏసీ, టాయిలెట్‌, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తారు. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో వున్న కంటెయినర్ల వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ర్టిక్‌ బస్సుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. దీని వల్ల విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. క్యాబ్‌ల కంటే తక్కువ చార్జీతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలో తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటెయినర్‌ లాంజ్‌లు ఏర్పాటు చేయడం విశేషం. వీటిని బస్టాపులకు కొంత దూరంలో పెడుతున్నారు. సాధారణ బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇవి వేరుగా ఉండాలని భావిస్తున్నారు.

తొలుత 20 బస్సులు

విశాఖకు ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించింది. వాటిలో తొలి విడత 20 బస్సులు నాలుగు రోజుల్లో ఇక్కడకు వస్తాయి. చార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. బస్సులు రాగానే ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం. వీటిలో 10 బస్సులు గాజువాక నుంచి జాతీయ రహదారిలో ఆనందపురం మీదుగా భోగాపురం వరకు తిరుగుతాయి. మరో 10 బస్సులు గాజువాకలో బయలుదేరి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్తాయి.

- అప్పలనాయుడు, ఆర్‌టీసీ ఆర్‌ఎం, విశాఖపట్నం

ప్రారంభోత్సవం నాడే అంతర్జాతీయ సర్వీసులు పెట్టాలి

జీఎంఆర్‌ యాజమాన్యం భోగాపురం విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ కౌంటర్లు, లగేజీ స్కానింగ్‌ వంటి వాటికి సంబంధించి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నది. జూలై 5న విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. అయితే ప్రారంభోత్సవ తేదీన అంతర్జాతీయ సర్వీసులు కొన్ని అయినా పెట్టాలని కోరుతున్నాం.

- ఓ.నరేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు, అపాటా

Updated Date - Jun 16 , 2026 | 04:34 AM