Bhogapuram Airport: ఎర్ర బస్సూ రాదన్నది ఎవరు జగన్
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:03 AM
ఇప్పుడు ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ స్వాగతించారు. అంతేకాదండోయ్... ఆ ఘనత అంతా తనదేనని చెప్పుకొన్నారు. అంతటితో ఆగకుండా... చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’ చేస్తున్నారని చిత్రాలు పోయారు.
‘భోగాపురం’పై నాడో మాట.. నేడో మాట
విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం
అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే
జగన్ వచ్చాక పనులు గాలికి
ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి
కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌కు బెదిరింపులు
తీరా ఎన్నికల ముందు మళ్లీ శంకుస్థాపన
ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్, ఆయన రోతపత్రిక గొప్పలు
పైగా చంద్రబాబుపై నిస్సిగ్గుగా నిందలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘ఎర్ర బస్సు’ కూడా రాని చోటికి ఎయిర్‌బస్సు ఎందుకని గేలి చేసిన వ్యక్తి..
భోగాపురానికి భూములు ఇవ్వొద్దు.. అని రైతులను పదేపదే రెచ్చగొట్టిన వ్యక్తి..
‘మేం వస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం’.. అని భూసేకరణకు అడ్డుపడిన వ్యక్తి..
విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్లలోనే మరొకటి ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి..
ఇప్పుడు ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ స్వాగతించారు. అంతేకాదండోయ్... ఆ ఘనత అంతా తనదేనని చెప్పుకొన్నారు. అంతటితో ఆగకుండా... చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’ చేస్తున్నారని చిత్రాలు పోయారు. తన రోత పత్రికలో విచిత్రమైన కథనాలు ప్రచురించారు. ఆయనే... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! కానీ... నిజం దాచాలన్నా దాగదు! భోగాపురం విమానాశ్రయంపై ఆయన ‘బోగస్ మాటలు’ సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన చేష్టలు కళ్లముందే కనపడుతున్నాయి. అయినా సరే... ‘నవ్విపోదురుగాక’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు చూసి ఉత్తరాంధ్ర మొత్తం ముక్కున వేలేసుకుంటోంది. భోగాపురంపై జగన్, ఆయన రోత మీడియా ఇప్పుడు చెబుతున్నదేమిటి... అసలు వాస్తవాలు ఏమిటి? మీరే చూడండి!
జగన్ అనుమతులు సాధించారట
2019 ఎన్నికల ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపన చేశారని అబద్ధాలు వండివార్చారు. జగన్ పాలనలో వేగవంతంగా అనుమతులు వచ్చాయని, 2023 మే 3న ఆయన శంకుస్థాపన చేశారని గొప్పలు చెప్పారు.
ఇదీ వాస్తవం: విశాఖ విమానాశ్రయం తూ ర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆంక్షలతో నడుస్తోంది. నేవీ అవసరాలకు ఒకవైపు వాడుకుంటూ.. మరోవైపు పౌర విమానాలను అనుమతిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలు విశాఖ రావడానికి తటపటాయించే పరిస్థితి. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని విధంగా సమ ుద్రం పక్కనే భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా అశోక్‌గజపతిరాజు ఉండడంతో వెంటనే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. అవసరమైన అనుమతులు తీసుకున్నారు. 2019 ఫిబ్రవరిలో భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలు జీఎంఆర్ గ్రూపునకు అప్పగించి శంకుస్థాపన కూడా చేశారు. మరింత దూరదృష్టితో ఆలోచించిన చంద్రబాబు విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు (ఎంఆర్‌ఓ) కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం భూ సేకరణకు నడుం కట్టారు. వాస్తవం ఇది. అయితే జగన్మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే భోగాపురం విమానాశ్రయం పనులు జరగకుండా అడ్డు పడ్డారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని గుర్తించి చంద్రబాబు శంకుస్థాపన చేసిన దానికే 2023లో జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు.
జగన్ భూసేకరణ చేశారట
2022లో కోర్టు కేసులు తొలగించి జగన్ సర్కారు భూసేకరణ పూర్తి చేసిందని గొప్పలకు పోయారు.
ఇదీ వాస్తవం:గత టీడీపీ హయాంలోనే భూసేకరణ చేశారు. జగన్ అడ్డుపడినా చంద్రబాబు 2,703 ఎకరాల భూమిని సేకరించారు. జగన్ 2019లో అధికారంలోకి రాగానే పనులు జరగకుండా గాలికి వదిలేశారు. భోగాపురంలో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు (ఎంఆర్‌ఓ) అవసరం లేదని ఒక నివేదిక తయారు చేయించి, చంద్రబాబు కేటాయించిన భూమిలో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. విమానాశ్రయానికి 2,203 ఎకరాలే ఇచ్చారు. ఆ భూముల్లో కొబ్బరి,జీడి,తాటి చెట్లు కొట్టించి చదును చేసిన భూములు జీఎంఆర్‌కు అప్పగించాల్సి ఉండగా మూడేళ్లు తిప్పలుపెట్టారు. ఎన్నికల ముం దు మళ్లీ తూతూ మంత్రంగా పనులు చేపట్టారు.
ఎన్‌వోసీ ఘనత జగన్‌దేనట
2022లో జగన్ సర్కారు భూసేకరణ పూర్తి చేసిందని, అదేఏడాది కేంద్రం ఎన్‌వోసీ ఇచ్చిందని గొప్పలు చెప్పారు.
ఇదీ వాస్తవం: 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మురిగిపోయే వరకు భోగాపురం విమానాశ్రయం పనులు ఒక్కటి కూడా చేపట్టలేదు. దాంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌ఓసీ ఇవ్వడానికి నిరాకరించింది. వీటన్నింటినీ చూపించి జీఎంఆర్‌తో రాయబేరాలు నడిపారు. కాకినాడలో ఆర్థిక మండలి భూములతో లింకులు పెట్టి దారికి తెచ్చుకున్నారు. నాడు జీఎంఆర్ గ్రూపును అన్ని విధాలా ఇబ్బందులు పెట్టి.. ఇప్పుడు అభినందనలు చెప్పడం జగన్‌కే చెల్లు.
నాశనం చేసి లక్ష్యం నిర్దేశించారట
టీడీపీ హయాంలో భోగాపురం విమానాశ్రయం పనులే జరగలేదన్నట్టుగా, జగన్ వచ్చాకే ఆయన నిర్దేశించిన లక్ష్యంతో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తోందని, గణనీయమైన భాగం తమ హయాంలోనే పూర్తయిందని చెప్పారు.
ఇదీ వాస్తవం: 2019లో జగన్ సర్కారు వచ్చాక వివిధ ప్రధాన ప్రాజెక్టుల మాదిరిగానే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను అటకెక్కించారు. ఎన్నికల ముందు నామమాత్రంగా నత్తనడకన పనులు చేపట్టారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ మోక్షం వచ్చింది. పనులు పరుగులు తీసేలా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కె.రామ్మోహన్‌నాయుడుకు కేంద్రం పౌర విమానయాన శాఖ అప్పగించడంతో విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రతి నెల సమీక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేయడానికి కృషిచేశారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబరు వరకూ గడువు ఉన్నప్పటికీ ఆరు నెలలు ముందుగానే పూర్తి చేయాలని జీఎంఆర్‌కు నిర్దేశించారు. జూన్ నాటికి అనుకున్నా దాని కంటే ముందే పనులు దాదాపు పూర్తి కావడంతో ఆదివారం ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది.
చంద్రబాబు భూసేకరణ చేయలేదట
నాడు చంద్రబాబు సర్కారు విమానాశ్రయానికి భూసేకరణ చేయలేదంటూ మరో అభాండం వేశారు.
ఇదీ వాస్తవం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం మండలానికి వెళ్లిన జగన్.. రైతులు ఎవరూ విమానాశ్రయానికి భూములు ఇవ్వవద్దని రెచ్చగొట్టారు. కొందరితో కోర్టులో కేసులు కూడా వేయించారు. ఇలా విమానాశ్రయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డం పడ్డారు. వీటన్నింటిని అధిగమించిన చంద్రబాబు 2,703 ఎకరాల భూమిని సేకరించారు.
అశోక్ చోరవ
కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయం మంజూరైంది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా...అశోక్ గజపతిరాజు తనకు వారసత్వంగా వచ్చిన 136 ఎకరాలను మాన్సాస్ ట్రస్ట్ తరఫున ఉచితంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన భూమిలో జగన్ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటే... అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె ఆదితి కలిసి సుమారుగా వేయి కోట్ల రూపాయల విలువైన భూమిని ఉచితంగా ఇచ్చారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్‌నాయుడుల కృషి వల్ల భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది.