Share News

భోగాపురం విమానాశ్రయానికి ఇమిగ్రేషన్‌ హోదా

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:06 AM

భోగాపురం విమానాశ్రయం మరో కీలక మైలురాయిని సాధించింది. ‘అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌’గా భోగాపురాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను//

భోగాపురం విమానాశ్రయానికి ఇమిగ్రేషన్‌ హోదా

  • కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం మరో కీలక మైలురాయిని సాధించింది. ‘అథరైజ్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌’గా భోగాపురాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్టుల జాబితాను పేర్కొంటూ, సెప్టెంబరు 1, 2025 నాటి నోటిఫికేషన్‌ను సవరిస్తూ కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌- 2025లోని సెక్షన్‌ 4(1) కింద కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని, హోం శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్టుల జాబితాలో (కేటగీరీ-1 విమానాశ్రయాలు) భోగాపురం విమానాశ్రయాన్ని 39వ నంబరుగా చేరుస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహించాలంటే ఆ విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పాయింట్‌ హోదా లభించడం ఒక కీలక, చట్టపరమైన అవసరం. నేడు భోగాపురానికి ఆ హోదా దక్కడంతో, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు మొదలైనప్పుడు పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, వీసా తనిఖీలు, ఇతర ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలను నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించినట్లయింది. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భోగాపురం విమానాశ్రయానికి ఎయిరోడ్రోమ్‌ లైసెన్స్‌ను జీఎంఆర్‌ ప్రతినిధులకు అందజేశారు. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్‌ హోదా కూడా లభించడంతో వాణిజ్యపరమైన విమాన కార్యకలాపాలకు విమానాశ్రయం సిద్ధమవుతోంది.

Updated Date - Jul 14 , 2026 | 04:06 AM