గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉత్తరాంధ్ర
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:09 AM
ఉత్తరాంధ్ర ఇప్పుడు గ్లోబల్ డెస్టినేషన్‌గా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘స్వర్ణాంధ్ర-2047’ పేరుతో విశాఖపట్నంలో సీఐఐ శనివారం నిర్వహించిన సదస్సుకు...
జూన్ నెలాఖరుకు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం
దేశంలో ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే లక్ష్యం
సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడి
విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇప్పుడు గ్లోబల్ డెస్టినేషన్‌గా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘స్వర్ణాంధ్ర-2047’ పేరుతో విశాఖపట్నంలో సీఐఐ శనివారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భోగాపురం విమానాశ్రయం, మూలపేట (శ్రీకాకుళం జిల్లా) పోర్టు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్, అనేక చైన్ హోటళ్లు శంకుస్థాపనలు చేసుకోనున్నాయని వివరించారు. వీటన్నింటిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. దేశంలో ప్రతి 45 నుంచి 50 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ప్రారంభించాలనే ప్రణాళికతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో భవిష్యత్తు అవసరాలకు 1,700 విమానాలు అవసరమని, రానున్న 16 ఏళ్లలో అవన్నీ సమకూరతాయన్నారు. పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు పెరుగుతున్నాయని, అయితే ఆ భారం ప్రయాణికులపై పడకుండా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. గతంలో సంగీతం, క్రీడా పరికరాలను విమానాల్లో అనుమతించలేదని, ఇప్పుడు వాటితోపాటు పెంపుడు జంతువులకు సైతం అవకాశం కల్పించామని వివరించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో పాటు 14 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ 2గంటల ప్రయాణ దూరంలో విమానాశ్రయం ఉండాలని చెప్పారు.
రాష్ట్రానికి రూ.22లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్మోహన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్నామని చెప్పారు. దావోస్‌లో ఏపీని ఒక రాష్ట్రంలా కాకుండా ఒక దేశంలా భావిస్తూ ప్రాధాన్యమిస్తున్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు కృషి వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నెలాఖరుకు ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి తెలిపారు. విమానాశ్రయం బయట పనులన్నీ పూర్తయ్యాయని, టెర్మినల్ లోపల పనులు జరుగుతున్నాయని చెప్పారు. సీఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ గన్నమనేని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంత చైర్మన్, మూత్తూట్ ఫిన్‌కార్ప్ సీఎండీ థామస్ జాన్ కీలకోన్యాసం చేశారు. గ్రీన్‌కో ప్రెసిడెంట్ మహేశ్ కొల్లి మాట్లాడారు. అనంతరం ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్సలెన్స్-2025 పురస్కారాలను 64 కంపెనీలకు అందించారు.