అవినీతి అధికారికి అందలం!
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:44 AM
తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా బదిలీ అయిన ఓ అధికారిని ఐదు నెలలు తిరగకముందే మళ్లీ అందలం ఎక్కించిన ఉదంతమిది!. విశాఖపట్నంలో...
పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా భవానీశంకర్
విశాఖ డీఆర్‌వోగా భారీగా వసూళ్లు
ఆరోపణల నేపథ్యంలో వెయిటింగ్‌కు
తాజాగా ఉపముఖ్యమంత్రి ఇలాకాకు
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా బదిలీ అయిన ఓ అధికారిని ఐదు నెలలు తిరగకముందే మళ్లీ అందలం ఎక్కించిన ఉదంతమిది!. విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు అధికారులకు నెలవారీ టార్గెట్‌లు విధించి మరీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ, దానికి భిన్నంగా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. సదరు అధికారి గురించి తెలిసి కూడా ఏరికోరి పోస్టింగ్ ఇప్పించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ అవినీతి అధికారే భవానీ శంకర్. గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తాజాగా ఈయనను పిఠాపురం ఏరియా డెవల్‌పమెం ట్ అథారిటీ పీడీగా నియమించారు. ఈ మేర కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు(జీవో 578) జారీ చేశారు. ఉపముఖ్యమంత్రి కార్యాలయం విన్నపం మేరకే భవనీశంకర్‌ను ఆ పోస్టులో నియమించారు. ఇంతకుముందు భవానీ శం కర్ విశాఖ జిల్లా డీఆర్‌ఓగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పనితీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విశాఖ జిల్లా పరిధిలోని 4 మండలాల తహసీల్దార్లకు ఆయన నెలవారీ టార్గెట్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇక, భూ వివాదాలు, ఇతర అంశాల్లో తహసీల్దార్‌లు ప్రతి నెలా రూ.20 వేలకుపైనే పంపించాలని ఒత్తిళ్లు చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆర్‌డీఓ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భవానీ శంకర్‌పై తీవ్ర అభియోగాలూ చేశారు. ఈ ఫిర్యాదులు రెవెన్యూశాఖకు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఆయనకు మొన్నటి వరకు సీఎం కార్యాలయంలో పనిచేసిన ఓ కీలక అధికారి అండదండలు ఉండడంతో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించకుండా అడ్డుపడ్డారని తెలిసింది. ఆర్‌డీఓ ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు లేవంటూ కలెక్టర్ స్థాయిలోనే ఫిర్యాదులను బుట్టదాఖలు చేసేలా మంత్రాంగం నడిపారు. కానీ, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆరోపణలున్న డీఆర్‌ఓను, ఫిర్యాదు చేసిన ఆర్‌డీఓను విశాఖ నుంచి బదిలీచేసి జీఏడీకి రిపోర్టు చేయాలని గత ఏడాది అక్టోబరులో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో భవానీ శంకర్‌పై వచ్చిన ఫిర్యాదుల్లో తీవ్రత ఉండటంతో ఆయనకు తదుపరి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది.
పవన్ పేషీ నుంచే..: పవన్ వద్ద పనిచేస్తున్న ఓ అధికారి చొరవతో భవనీశంకర్‌ను పిఠాపురంలో నియమించాలని భావించారు. అనుకున్నదే తడవుగా పవన్ పేషీలోని ఓఎ్‌సడీ నుంచి ప్రభుత్వానికి ఓ లేఖ పెట్టించారు. దాంతో ప్రభుత్వం భవానీ శంకర్‌ను పీఏడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించింది. తీవ్ర ఆరోపణలతో వెయింటింగ్‌లో ఉన్న అధికారికి ఉపముఖ్యమంత్రికి కీలకమైన ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.