Share News

కదం తొక్కిన కార్మిక లోకం

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:45 AM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్‌ బంద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా సాగింది..

కదం తొక్కిన కార్మిక లోకం

  • రైతు, ఉద్యోగ సంఘాల సంఘీభావం

  • లేబర్‌ కోడ్‌లు తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌

  • మూతపడిన బ్యాంకులు, అంగన్‌వాడీ కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్‌ బంద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా సాగింది. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఐటీయూ, వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. డైమండ్‌ పార్కు నుంచి ఏడు రోడ్ల జంక్షన్‌ వరకు ఎర్రజెండాలతో, పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాజరై సంఘీభావాన్ని తెలియజేశారు. విజయనగరంలో సీఐటీయూ, ఏఐసీసీటీయూ, ఐఎ్‌ఫటీయూ, కార్మిక, రైతు, మహిళ, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోట జంక్షన్‌ నుంచి గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. మోదీ ప్రభుత్వం తక్షణమే లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని యూనియన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పట్టణాల్లో ఆటోలు తిరగకుండా అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌), రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, అనేకచోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు సమ్మెలో బాగస్వాములయ్యారు. ఎల్‌ఐసీ, పోస్టల్‌, విద్యుత్తు కార్యాలయాల వద్ద కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం ఆర్టీసీపై ఎక్కువగా కనిపించింది. నెల్లూరు నగరంలో సీపీఎం, సీపీఐ, వైసీపీ, వివిధ ట్రేడ్‌ యూనియన్లు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించి ఉద్యోగులంతా ఒక్క తాటి మీదకు రావాలని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్‌లో భోజన విరామ సమయంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లేబర్‌ కోడ్‌లు కార్మికుల హక్కులను కుదించేవిగా ఉన్నాయని, వాటిని ఉద్యోగులంతా ప్రతిఘటించాలని కోరారు. ఏలూరు నగరంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతులు, కూలీలు, వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు.


ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు చేపట్టిన ర్యాలీలో వైసీపీ నేతలు ఎర్ర కండువాలు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు మామిళ్లపల్లి జయప్రకాశ్‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల శాఖలన్నీ మూతపడగా ఎల్‌ఐసీ కార్యాలయాలను ఉద్యోగులు స్వచ్ఛందంగా మూసివేశారు. కార్మిక సంఘాలకు మద్దతుగా కలెక్టరేట్‌ వద్ద భోజన విరామ సమయంలో జిల్లా ఎన్జీవో సంఘం ఆఽధ్వర్యంలో నినాదాలు చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించకపోతే మోదీ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే కార్మిక పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతిలో మోదీ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణ వంటి వివిధ డిమాండ్లను ఆయన లేవనెత్తారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడమే ఆలస్యం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయాలని తహతహలాడుతోందని అన్నారు. కారు చౌకగా భూములను అదానీ, అంబానీలకు, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు.

3.jpg

Updated Date - Feb 13 , 2026 | 03:45 AM