Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - May 20 , 2026 | 12:29 AM

భానుడు మంగళవారం మరింత మంట రేపాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా వుంది. పది గంటల నుంచి వడగాడ్పులు మొదలయ్యాయి. మధ్యాహ్న సమయానికి ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరుకొని జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భానుడి భగభగలు

దేవరాపల్లిలో 42.8 డిగ్రీలు నమోదు

ఎనిమిది మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు

నేడు, రేపు ఠారెత్తించనున్న ఎండ

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు

అనకాపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): భానుడు మంగళవారం మరింత మంట రేపాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా వుంది. పది గంటల నుంచి వడగాడ్పులు మొదలయ్యాయి. మధ్యాహ్న సమయానికి ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరుకొని జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో కూడా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దేవరాపల్లి మండలంలో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా రాంబిల్లి మండలంలో 35.8 డిగ్రీలు నమోదైంది. మొత్తం మీద ఎనిమిది మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. మండలాల వారీగా గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మాకవరపాలెంలో 41.2, నాతవరంలో 40.8, బుచ్చెయ్యపేటలో 40.5, రావికమతంలో 40.5, రోలుగుంటలో 40.5, మాడుగుల 40.3, నర్సీపట్నంలో 40.3, చీడికాడలో 39.8, చోడవరంలో 39.8, కె.కోటపాడులో 39.6, గొలుగొండలో 38.8, కశింకోటలో 38.7, కోటవురట్లలో 38.2, మునగపాకలో 38.2, నక్కపల్లిలో 38, సబ్బవరంలో 37.9, అనకాపల్లిలో 37.2, పాయకరావుపేటలో 36.6, అచ్యుతాపురంలో 36.4, ఎస్‌.రాయవరంలో 36.4, పరవాడలో 36.3, ఎలమంచిలిలో 36.3 రాంబిల్లిలో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నేడు, రేపు మంటలే...

జిల్లాలోని అత్యధిక మండలాల్లో బుధ, గురువారాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతోపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో హెచ్చరించింది. ప్రధానంగా సముద్ర తీరానికి దూరంగా వున్న అనకాపల్లి, బుచ్చెయ్యపేట, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, చోడవరం, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట, సబ్బవరం మండలాల్లో బుధవారం 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాస్తుంది. పది గంటల నుంచి సాయంత్రం వరకు వడగాడ్పులు వీస్తాయి. జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరవాడ, సబ్బవరం మండలాల్లో సైతం 40 డిగ్రీలు దాటతాయి. అందువల్ల ప్రజలు ఉదయం పది గంటల తరువాత ఇళ్లకే పరిమితం కావాలని, ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:29 AM