Share News

పత్తిలో గేమ్‌చేంజర్‌.. ‘బీజీ2208’

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:41 AM

పత్తి రైతుల కోసం లాం పరిశోధన స్థానం మరో కీలక ఆవిష్కరణ చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ ...

పత్తిలో గేమ్‌చేంజర్‌.. ‘బీజీ2208’

  • కొత్త విత్తనం విడుదల చేసిన లాం ఫాం

  • ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి

  • తక్కువ పెట్టుబడితో అధిక లాభం

  • విత్తనాన్ని పునర్వినియోగించుకోవచ్చు

అమరావతి, గుంటూరు సిటీ, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): పత్తి రైతుల కోసం లాం పరిశోధన స్థానం మరో కీలక ఆవిష్కరణ చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్థి చేసిన నూతన పత్తి విత్తనం ‘బీజీ 2208 బీజేఏ (ఆదిత్య జీడీఐ)’ను రైతుల కోసం విడుదల చేసింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇవ్వగల సామర్థ్యం, కీటకాలు, తెగుళ్లను సమర్థంగా తట్టుకునే లక్షణాలతో ఈ కొత్త రకం విత్తనం పత్తి సాగులో సంచలన వెరైటీగా నిలవనుందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ పీవీ సత్యనారాయణ చెప్పారు. దీర్ఘకాలిక పరిశోధనల అనంతరం అభివృద్ధి చేసిన ఈ వెరైటీ పత్తి సాగులో గణనీయమైన మార్పులు తీసుకురానుందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులకు ఇది ఉపయోగకరంగా నిలవనుంది. ఈ పత్తి రకం ఎకరాకు సగటున 32-35 క్వింటాళ్ల దిగుబడి ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది సూటి రకం(నాన్‌-హైబ్రిడ్‌) కావడంతో రైతులు ప్రతి సీజన్‌లో కొత్త విత్తనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి విత్తనాన్ని తీసుకుని పునర్వినియోగం చేసుకునే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

తెగుళ్ల నిరోధకత.. రైతులకు లాభం

ఈ రకం పత్తి ప్రధానంగా కాయ తొలుచు పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పేను బంక పురుగు వంటి రసంపీల్చే పురుగులను తట్టుకుంటుంది. అలాగే బాక్టీరియల్‌ ఆకుమచ్చ, ఆల్టర్నేరియా, సెర్కోస్పోరా వంటి ప్రధాన తెగుళ్లపై కూడా మంచి నిరోధకత చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. విత్తన ఖర్చు తగ్గడం, పురుగు మందుల వ్యయం తగ్గడం వల్ల సాగు వ్యయం తగ్గి రైతుల లాభదాయకత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


5.jpg

రైతులకు ప్రయోజనకారి

బీజీ 2208 బీజేఏ (ఆదిత్య జీడీఐ) పత్తి విత్తన రకం ఆవిష్కరించడంలో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. ఈ సూపర్‌ కాటన్‌ వెరైటీ పత్తి రైతులకు బహు ప్రయోజనకారి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పత్తి రైతులకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలుస్తుంది.

- పీవీ సత్యనారాయణ, వీసీ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం

ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్న

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ‘లాం బీజీ టూ-2208(ఆదిత్య బీజీ-2) కొత్త బీటీ పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఆవిష్కరించారు. విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీ్‌సలో ఆంగ్రూ వీసీ పీవీ సత్యనారాయణతో కలిసి, ఆవిష్కరించిన ఈ కొత్త బీటీ విత్తనాలను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పత్తి విత్తనాల్లో కల్తీ వల్ల రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో ఆంగ్రూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త బీటీ విత్తనాలు రైతులకు భరోసా ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ సాగుకు ఈ విత్తనాలను సిఫారసు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ సతీష్‌, రీసెర్చ్‌ డైరెక్టర్‌ సుమతి, ఏడీఆర్‌ దుర్గాప్రసాద్‌, పత్తి ప్రధాన శాస్త్రవేత్తలు రాఖమణి, చాముండేశ్వరి, రాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 05:41 AM