Share News

ప్రాణం తీసిన బెట్టింగ్‌ యాప్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:09 AM

బెట్టింగ్‌ యాప్‌లలో భారీగా నగదు కోల్పోయి, మానసిక ఒత్తిడికి గురై ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రాణం తీసిన బెట్టింగ్‌ యాప్‌

  • నూజివీడులో డాక్యుమెంట్‌ రైటర్‌ ఆత్మహత్య

  • ఆస్తులు అమ్ముకొని..అప్పుల పాలు

నూజివీడు టౌన్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్‌లలో భారీగా నగదు కోల్పోయి, మానసిక ఒత్తిడికి గురై ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో సోమవారం జరిగిందీ ఘటన. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన షేక్‌ సుభాని(35) నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో డాక్యుమెంట్‌ రైటర్‌గా పని చేస్తున్నారు. తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే సోమవారం తెల్లవారుజామున ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించారు. ఉదయాన్నే కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి ఈ విషయాన్ని స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. సుభాని బెట్టింగ్‌ యాప్‌లలో భారీగా నగదు పోగొట్టుకుని ఇటీవలే ఇంటిని కూడా అమ్మేశారని, దీంతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానిక డాక్యుమెంట్‌ రైటర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:11 AM