Share News

బెజవాడ.. ‘గాంధీ గిరి’ !

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:07 AM

జాతీయోద్యమం బెజవాడ చర్రితను కొత్త మలుపు తిప్పింది! జాతిపిత మహాత్మాగాంధీ పాదస్పర్శ నగరాన్ని ఉద్యమ కేంద్రంగా మార్చింది. 1919 నుంచి 1936 వరకు ఆయన సందర్శనలు ప్రజల్లో స్వాతంత్య్ర భావనను రగిలించాయి.

బెజవాడ.. ‘గాంధీ గిరి’ !

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో బెజవాడ నగరానికి కీలకమైన స్థానం ఉంది. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహాత్ముని అడుగుజాడలతో పునీతమైన నగరమిది! జాతీయోద్యమ స్ఫూర్తిని, గాంధేయవాదాన్ని పుణికిపుచ్చుకున్న ఈ నగరం గాంధీజీ అడుగుజాడల్లో నడిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా నేటి గాంధీనగర్‌ ప్రాంతం కేవలం ఒక పేరు కాదు.. అది ఒక ఉద్యమ కేంద్రం.. త్యాగాల ప్రతిరూపం.. గాంధీజీ పట్ల బెజవాడ ప్రజలకున్న అచంచలమైన అభిమానానికి నిదర్శనం! గాంధీజీ విజయవాడలో జరిపిన పర్యటనలు స్థానిక ప్రజలలో స్వాత్రంత్య్ర కాంక్షను రగిలించాయి. అప్పట్లో వన్‌టౌన్‌ నుంచి ప్రారంభమైన ఈ చైతన్యం, క్రమంగా గాంధీనగర్‌ ఆవిర్భావానికి పునాది వేసింది. నేడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా బెజవాడలో గాంధీజీ పర్యటనలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ అవలోకనం!

  • మహాత్ముడి పాద స్పర్శతో పులకించిన నేల.. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన వేళ

  • గాంధీజీ స్మారకార్థంగా ప్రసిద్ధి చెందిన గాంధీ కొండ

  • మిల్క్‌ఫ్యాక్టరీ సమీపంలో గాంధీ ఆలయ నిర్మాణం

  • నేటికీ ఏటా 100 మంది వరకు దీక్షలు

  • (ఆంధ్రజ్యోతి-విజయవాడ కల్చరల్‌)

జాతీయోద్యమం బెజవాడ చర్రితను కొత్త మలుపు తిప్పింది! జాతిపిత మహాత్మాగాంధీ పాదస్పర్శ నగరాన్ని ఉద్యమ కేంద్రంగా మార్చింది. 1919 నుంచి 1936 వరకు ఆయన సందర్శనలు ప్రజల్లో స్వాతంత్య్ర భావనను రగిలించాయి. వన్‌టౌన్‌ నుంచి మొదలైన ఈ చైతన్యం ‘గాంధీనగర్‌’ అవతరణకు పునాది పడగా, అక్కడప్రారంభమైన ఉద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మహా సంగ్రామంగా మారింది.

తొలి సందర్శన 1919లో..

రౌలట్‌ చట్టాన్ని గాంధీజీ నిరసిస్తూ దేశమంతా పర్యటించారు. ఈ సందర్భంలోనే 1919లో తొలిసారి బెజవాడ వచ్చారు. 1919 ఏప్రిల్‌ 6న పట్టణ ప్రజలు సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. అన్ని వర్గాలవారూ ఏకమై ఊరేగింపులు చేశారు. అదే రోజు సాయంత్రం మిషన్‌ స్కూల్‌ ఎదుట జరిగిన సభకు ఐదువేల మంది హాజరయ్యారు. సభకు మహాకవి బుచ్చి సుందరరామ శాస్ర్తి అధ్యక్షత వహించారు. గాంధీజీ రామ్మోహన్‌ గ్రంథాలయం ఆవరణలో ప్రసంగించారు. ఇది గాంధీనగర్‌ ఆవిర్భావానికి తొలి మెట్టు.


1920లో రెండోసారి..

గాంధీజీ రెండోసారి షౌకత్‌ అలీతో కలిసి 1920 ఆగస్టు 23న నగరానికి వచ్చారు. మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌ ఎదురుగా ఉన్న జమ్మిచెట్టు కింద జరిగిన సభలో బిరుదులను త్యజించడం, పన్నుల నిరాకరణ, కోర్టుల బహిష్కరణ వంటి అంశాలతో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సభ అనంతరం అయ్యదేవర కాళేశ్వరరావు శాసనసభ అభ్యర్థిత్వాన్ని విరమించి గాంధీజీ శిష్యరికాన్ని అంగీకరించారు. గులామ్‌ మొహియుద్దీన్‌ సాహెబ్‌ గౌరవ మేజిస్ర్టేట్‌ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.

కాంగ్రెస్‌ కమిటీ మహాసభలు

1921 మార్చి 31, ఏప్రిల్‌ 1 తేదీల్లో విక్టోరియా మ్యూజియం హాలులో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి రూపకల్పన చేశారు. గాంధీజీ, కస్తూర్బా, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇక మహాత్ముడు ఎక్కడ బస చేయాలన్న విషయమై పట్టణంలో ‘వేలంపాట’ నిర్వహించారు. అందరిలోకెల్లా గోళ్ల నారాయణరావు అనే వైశ్యప్రముఖుడు అత్యధికంగా వేలం పాడడంతో, వన్‌టౌన్‌లోని ఆయన మేడపై గాంధీజీ, కస్తూర్బా, మహదేవ దేశాయ్‌ బస చేశారు. గాంధీ ఏర్పాటు చేసిన స్వరాజ్య నిధికి అప్పట్లోనే రూ.25 వేల నగదు, రూ.2,500 విలువచేసే ఏడువారాల నగలు(అప్పటి ధర ప్రకారం), మరికొన్ని బంగారు వస్తువులు అందించారు. ఆ విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.46,500 కోట్లు ఉంటుందని మండలి బుద్ధప్రసాద్‌ గతంలో ప్రస్తావించారు. 1921 ఏప్రిల్‌ 1న గాంధీనగర్‌ మైదానంలో విశ్వబ్రాహ్మణ మహాసభ జరిగింది. స్వరాజ్యనిధికి విరాళాలు ఇవ్వాలని గాంధీజీ, తిలక్‌.. ప్రజలను కోరారు. కోటగిరి వెంకటకృష్ణారావు తమ ఉంగరాలు, గడియారం కానుకగా ఇచ్చారు. తర్వాతి కాలంలో 1936లో గాంధీజీ బెజవాడ మల్లీశ్వరాలయంలో హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు.

గాంధీ కొండ.. నేటికీ అలరారుతున్న వైభవం

నగరంలో ఇప్పటికీ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నిలిచిన గాంధీహిల్‌.. నాడు మహాత్మాగాంధీ స్మారకంగా నిర్మించినది. గాంధీజీ స్మారకార్థం దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇదొకటి. 1962 నవంబరు 9న అప్పటి ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్ర్తి శంకుస్థాపన చేయగా, 1968 అక్టోబరు 6న రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌.. ప్రారంభించారు. ఇక బెజవాడ మిల్క్‌ఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో గాంధీ దేవాలయం నిర్మించారు. 2012 నుంచి దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఏటా 70 నుంచి 100 మంది వరకు గాంధీజీని ఆరాధిస్తూ దీక్షలు తీసుకుంటారని స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం అధ్యక్షుడు రాంపల్లి జయప్రకాశ్‌ తెలిపారు.

2.jpg1.jpg

Updated Date - Jan 30 , 2026 | 05:07 AM