Guinness Speed Highway: గిన్నిస్ స్పీడ్‌తో రోడ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:24 AM
బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు గిన్నిస్ రికార్డు సాధించే వేగంతో సాగుతున్నాయి.
అత్యంత వేగంగా బెంగళూరు- విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం
నిరంతరాయంగా ఏడు రోజుల్లో 52 కి.మీ రోడ్డు
పుట్టపర్తి మండలంలో రోడ్డు పనులకు శ్రీకారం
నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నం
పుట్టపర్తి రూరల్, జనవరి 5(ఆంద్రజ్యోతి): బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు గిన్నిస్ రికార్డు సాధించే వేగంతో సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులను సాధించాలనే లక్ష్యంతో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వానవోలు-వంకరకుంట మధ్య నిర్మాణ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సోమవారం ఉదయం 9.30కు పనులను ప్రారంభించింది. దేశ రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు జాతీయ రహదారి-544జీ పనులను వేదికగా చేసుకుంది. ప్యాకేజీ-2 కింద ఈ పనులను చేపట్టామని ఆ సంస్థ సీఎండీ జగదీశ్ కదం, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ అధికారి ఆర్‌కే సింగ్ తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భారీ పనుల్లో 600 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు.
ఇవే ఆ రికార్డులు
ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏడు రోజుల్లో నిరంతరాయంగా 52 కి.మీ. బిట్యుమినస్ రోడ్డును నిర్మిస్తారు.
అత్యంత ఎక్కువ మొత్తంలో నిర్మాణ సామగ్రిని వినియోగించడం.
24 గంటల్లో అత్యంత పొడవైన రోడ్డు నిర్మాణం.
24 గంటల్లో అత్యంత ఎక్కువ బిట్యుమినస్ కాంక్రీట్‌ను ఉపయోగించడం.
గతంలోనూ రికార్డులు
పుణెకు చెందిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ గతంలోనూ మూడు రికార్డులను సాధించింది. 24 గంటల్లో 39.691 కి.మీ. బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది. జాతీయ రహదారి 53పై 75 కి.మీ. సింగిల్ లేన్ బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణంలోనూ గిన్నిస్ రికార్డును సాధించింది. 2022 జూన్ 3 నుంచి 7 వరకు మహరాష్ట్రలోని అమరావతి జిల్లా నుంచి అకోలా వరకు 42.2 కి.మీ. రెండులేన్ల రోడ్డును (84.4 కి.మీ. సింగిల్ లేన్ పొడవుకు సమానం) 105 గంటల 33 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు సొంతం చేసుకుంది. సత్యసాయిబాబా ఆశీస్సులతో, గత రికార్డుల స్ఫూర్తితో కొత్త రికార్డులు సృష్టిస్తామని సంస్థ జీఎం పురుషోత్తం ధీమా వ్యక్తం చేశారు.
బిట్యుమినస్ రోడ్డు ఇలా..
దీనినే అస్ఫాల్ట్ రోడ్డు అని కూడా పిలుస్తారు. వాహనాలకు అనువైన, మృదువైన రోడ్డుతో పాటు మన్నికైన నిర్మాణానికి బిట్యుమిన్‌ను ఉపయోగిస్తారు. ముడి చమురు నుంచి వచ్చే జిగటగా ఉండే నల్లటి, చిక్కటి పదార్థమే ఈ బిట్యుమిన్. రాయిని బాగా క్రష్ చేసి దానికి ఇసుక, కంకరతో పాటు తారులా ఉండే బిట్యుమిన్‌కు కలుపుతారు. దీంతో రోడ్డు ఉపరితలం దృఢంగానూ, మృదువుగానూ ఉంటుంది. వాటర్‌ఫ్రూ్‌ఫగానూ మారుతుంది. ఖర్చు తక్కువతో పాటు ఈ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయవచ్చు.