Record Achievement: ఒక రహదారి.. 4 గిన్నిస్ రికార్డులు
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:39 AM
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట-సాతర్లపల్లి మధ్య 554జీ జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్ వేగంగా సాగుతున్నాయి.
రికార్డుల మోతెక్కించిన బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్
24 గంటల్లో 28.89 కి.మీ. రహదారి, 10,655 టన్నుల కాంక్రీట్‌తో 2 రికార్డులు
7 రోజుల్లో 156 కి.మీ. రహదారి, 57,500 టన్నుల కాంక్రీట్‌తో మరో 2 రికార్డులు
ఎన్‌హెచ్ 544జీ నిర్మాణంలో అద్భుతం.. నేడు అధికారిక ప్రకటన
వర్చువల్‌గా పాల్గొననున్న కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు
అమరావతి, పుట్టపర్తి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట-సాతర్లపల్లి మధ్య 554జీ జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్ వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో నాలుగు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్యర్యంలో పనులు మొదలుపెట్టిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చరిత్రాత్మక ఘనత సాధించింది. పనులు మొదలైన వారం రోజుల్లోపే నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించింది. ఈ నెల 6న పుట్టపర్తి సమీపంలో ఎన్‌హెచ్‌ఏఐ రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించగా.. తాజాగా ఆదివారం మరో రెండు రికార్డులతో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఈ నెల 6వ తేదీన 24 గంటల వ్యవధిలో 28.95 కి.మీ. తారురోడ్డు నిర్మించడం, ఇదే సమయంలో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ (కంకర, తారు)ను ఉపయోగించడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. అలాగే ఏడు రోజులపాటు రాత్రింబవళ్లు తేడాలేకుండా 600 మందికిపైగా ఇంజనీర్లు, కార్మికు లు పనిచేసి 11.5 మీటర్ల వెడల్పు, మాడు లేన్లుగా బిటుమినస్ కాంక్రీట్‌తో 156 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు.
ఈ క్రమంలో 156 కి.మీ. తారు రోడ్డు నిర్మించడం, 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్(కంకర, తారు)ను ఉపయోగించి మరో 2 గిన్నిస్ రికార్డులు సాధించారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే 4 రికార్డులు సొంతమయ్యాయి. బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్‌లో భాగంగా వానవోలు-వంకరకుంట-ఓదులపల్లె సెక్షన్‌లోని ప్యాకేజీ 2, 3 పనుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. కాగా, ఈ రికార్డులను సోమవారం ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొంటారని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.