బెనిఫిట్టింగ్స్
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:09 AM
గురువు అంటేనే సమాజాన్ని మార్గదర్శకుడు.
కుటుంబ పింఛన పొందుతూ రెండో పెళ్లి
రికార్డుల్లో మాయాజాలం
రూ.17 లక్షలు స్వాహా
కుటుంబ పింఛన నిలిపేయాలని ప్రభుత్వానికి లేఖలు
గురువు అంటేనే సమాజాన్ని మార్గదర్శకుడు. అలాంటి వారే నేటి సమాజంలో ప్రలోభాలకు గురై గతి తప్పుతున్నారు. అతనో ప్రధానోపాధ్యాయుడు.. కుటుంబ పింఛన పొందేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశాడు. భార్య మరణానంతరం కుటుంబ పింఛనను తీసుకుంటున్నాడు. రెండో పెళ్లి చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా దాదాపు 20 ఏళ్ల వరకు ఇప్పుడు రిటైర్డ్ అయ్యే ముందు రెండో పెళ్లి చేసుకున్నానని, తన భార్య, పిల్లలకు కుటుంబ పింఛన బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాడు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన వ్యక్తి రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు ఎన్నో జిమ్మకులు చేశాడు. కుటుంబ పింఛన పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక వైపు మొదటి భార్య మరణానంతరం కుటుంబ పింఛన ప్రయోజనాలు పొందుతూనే... మరోవైపు రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెల వివరాలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం రెండో భార్యకు పదవీ విరమణ కుటుంబ పింఛన ప్రయోజనాలు దక్కేలా ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.
మొదటి భార్య 2004లో..
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో పీఎస్ హెచఎంగా పని చేసిన అతడి భార్య పత్తికొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ 2004 నవంబరు 7వ తేదీన మరణించింది. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన కుటుంబ పింఛనను భర్త పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో 2024 నవంబరు 16 వరకు దాదాపు రూ.17లక్షల మేర కుటుంబ పింఛన ప్రయోజనాలు పొందాడు.
ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన
ప్రభుత్వ ఉద్యోగి అయిన మొదటి భార్య మరణానంతరం ఆమె భర్త కుటుంబ పింఛన పొందుతున్నప్పడు భర్త రెండో వివాహం చేసుకోకూడదు. ఒకవేళ మళ్లీ పెళ్లి చేసుకుంటే అతడికి వచ్చే పింఛన బెనిఫిట్స్ రద్దు అయితాయి అనే నిబంధనలు ఉన్నాయి. వీటిని అతడు ఉల్లంఘించాడు. సదురు ఉపాధ్యాయుడు 2024 ఆగస్టు 28న రెండో వివాహం చేసుకున్నట్లు పేర్కొంటూ పెళ్లి పత్రికలు, ఫొటోలు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో కుటుంబ పింఛన నిలిపివేయాలని ట్రెజరీ అధికారులకు లేఖ రాశారు.
ఎస్‌ఆర్‌లో భార్య, పిల్లల వివరాలు
సదురు ఉపాధ్యాయుడు (ప్రస్తుతం రిటైర్డు టీచర్) సర్వీసు పుస్తకంలో రెండో భార్యతో పాటు 2008, 2011 సంవత్సరాల్లో ఇద్దరు కుమార్తెలు జన్మించినట్లు వివరాలను నమోదు చేశారు. రెండో వివాహం 2024లో జరిగినట్లు పేర్కొనడం పలు సందేహాలకు తావిస్తోంది. వివాహానికి ముందే ఇద్దరు పిల్లలు జన్మించినట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం.
మే 31న పదవీ విరమణ
2026 మే 31న సదురు ఉపాధ్యాయుడు తుగ్గలి మండలం రాతన గ్రామంలో పీఎస్ హెచఎంగా ఉద్యోగ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం రెండో భార్యకు కుటుంబ పింఛనతో పాటు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేలా సర్వీసు రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. మొదటిసారి ప్రభుత్వ కుటుంబ పింఛన పొందిన కాలానికి సంబంధించిన ఆదాయపు పన్ను, పాఠశాల విద్యార్థుల విద్యా రాయితీలు పొందాడు.
విచారణ చేపడుతాం
తుగ్గలి మండలం రాతన గ్రామంలో సదరు హెచఎం మే నెల 2026లో పదవీ విరమణ పొందాడు. ఆ రిటైర్డు హెచఎంపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడుతున్నాం.
ఫసుధాకర్, డీఈవో, కర్నూలు
ఉన్నతాధికారులకు తెలియజేశాం
ఆ రిటైర్డు ఉపాధ్యాయుడుపై వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారులకు విషయం తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు విచారణ చేసి క్రమశిక్షణ చర్యలుకు సిఫారసు చేస్తాం.
ఫ రామచంద్ర, డీటీవో, కర్నూలు