Share News

సతి వెనకే మృత్యులోకాలకు పతి...

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:58 AM

భార్య ఆత్మహత్య చేసుకుంది....భర్త ఆ సమాచారం తెలుసుకుని భార్య మృతదేహం ఉన్న ఆస్పత్రికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు...గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటలనలతో...

సతి వెనకే మృత్యులోకాలకు పతి...

  • కడుపునొప్పితో భార్య ఆత్మహత్య.. బస్సు ఢీకొని భర్త దుర్మరణం

బెంగళూరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): భార్య ఆత్మహత్య చేసుకుంది....భర్త ఆ సమాచారం తెలుసుకుని భార్య మృతదేహం ఉన్న ఆస్పత్రికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు...గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటలనలతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా బైలహొంగళ తాలూకా అరవళ్లి గ్రామానికి చెందిన మధుర (30), కరెప్ప (36) దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలున్నారు. మధుర కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతుండేది. దీంతో మనస్తాపం చెంది ఆదివారం క్రిమిసంహారక మందు తాగింది. వెంటనే స్థానికులు, బంధువులు బైలహొంగళ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు.. బెళగావి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి సిఫారసు చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె చనిపోయింది. విషయాన్ని ఆమె భర్త కరెప్పకు బంధువులు చేరవేశారు. వెంటనే అతడు ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వస్తుండగా అరవళ్లి క్రాస్‌ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాయవ్య ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం దంపతులు.. పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ తరువాత ఇద్దరూ ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆత్మహత్య, రోడ్డు ప్రమాదంపై బైలహొంగళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 05:59 AM