Minister Savitha: బీసీలే చంద్రబాబుకు శ్వాస
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:17 AM
బీసీలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్వాస, ధ్యాస అని, వారి సంక్షేమం కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో మంత్రి సవిత
అనంతపురం విద్య, జనవరి11(ఆంధ్రజ్యోతి): బీసీలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్వాస, ధ్యాస అని, వారి సంక్షేమం కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. ఆయన జయంతిని కూటమి సర్కారు రెండేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ వర్గాలకు గుర్తింపు తెచ్చింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. త్వరలో ఆదరణ-3 అమలుచేసి, వడ్డెర్లకు అవసరమైన పనిముట్లు అందజేస్తామన్నారు. కార్పొరేషన్లకు ఆయావర్గాల జనాభా దామాషా ప్రకారం నిధులిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఇన్‌చార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్‌రాజు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, టీడీపీ అనంత జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడుయాదవ్ పాల్గొన్నారు.
రేనాటి వీరుడు ఓబన్నకు సీఎం నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు ఓబన్న జయంతి సందర్భంగా ఆదివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి ఓబన్న సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడు ఓబన్న అని మంత్రి లోకేశ్ కొనియాడారు. ఆయన పోరాటం నేటితరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.