Minister Savita: జగన్, కేసీఆర్ కుట్ర రాజకీయాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:03 AM
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్, జగన్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు.
తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు: సవిత
పెనుకొండ టౌన్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్, జగన్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నదులను అనుసంధానం చేసిన సంగతి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ నాయకులు కొన్ని రోజుల నుంచి ఏపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వాటిని అవకాశంగా తీసుకుని చంద్రబాబును రాయలసీమ ద్రోహి అని జగన్ తన సొంత మీడియాలో చిత్రీకరిస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను ఆపింది తానే అని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారని, దానిపై జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చేయడం చేతకాక, చేసేవారిపై జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సొంత వ్యాపారాల కోసం కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై ఏపీ ప్రాజెక్టులను ఆపారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఉన్న కటౌట్‌లను ఏర్పాటు చేశారని, దానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అహర్నిశలూ కష్టపడుతున్న సీఎం చంద్రబాబుపై బురదచల్లడం మానుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో జగన్‌కు 11 సీట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో జీరో ఖాయమని చెప్పారు.