Share News

‘బీసీ సింహగర్జన ’పై ముగిసిన వాదనలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:51 AM

బీసీ సింహగర్జన బహిరంగ సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో...

‘బీసీ సింహగర్జన ’పై ముగిసిన వాదనలు

  • తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): బీసీ సింహగర్జన బహిరంగ సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ప్రకటించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈనెల 22న మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బీసీ సింహగర్జన సభ నిర్వహించాలని తలపెట్టినట్టు రామచంద్రయాదవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా హోంశాఖ తరఫు సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ వినతిని పోలీసులు తిరస్కరించారన్నారు. రామచంద్రయాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... రాజకీయపార్టీ బహిరంగ సభ నిర్వహణకు అనుమతివ్వకపోవడం ప్రాథమిక హక్కును హరించడమే అవుతుందన్నారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ... ‘ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, సీబీఎ్‌సఈ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసులందరూ ప్రస్తుతం ఆ విధుల్లో ఉన్నారు. బహిరంగసభ నిర్వహణకు సంబంధించి కోర్టు విధించిన షరతులను గతంలో పిటిషనర్‌ ఉల్లంఘించారు. రహదారి పై ట్రాఫిక్‌ను స్తంభింపజేసి, శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో బహిరంగ సభకు అనుమతివ్వడం సబబుకాదని భావించి పోలీసులు పిటిషనర్‌ వినతిని తిరస్కరించారు. సభకు అనుమతించాలని కోర్టు భావిస్తే సహేతుకమైన షరతులు విధించండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నిలువరించండి. సీసీ కెమెరాలతో కార్యక్రమాన్ని రికార్డు చేసేలా ఆదేశించండి’ అని కోరారు.

Updated Date - Feb 20 , 2026 | 04:52 AM