కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు!
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:36 AM
ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో .....
రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రయత్నం
జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి
ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనకు బిల్లు
ఆర్డినెన్స్ ద్వారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి బీసీ నేతలు, నిపుణులతో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘం నియమించి ముసాయిదా సిద్ధం చేసింది. బీసీలపై దాడులకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ముసాయిదాను అక్కడినుంచి క్యాబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి పంపాలని భావించారు. అయితే న్యాయకోవిదుల సూచనల మేరకు బిల్లును ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ పంపి, పరిశీలన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ రక్షణచట్టం మన రాష్ట్రంలోనే మొదటిసారి తీసుకొస్తుండటంతో ఈ చట్టం రూపకల్పనపై ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరికొంత సమయం తీసుకోవాలని యోచిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో చట్టం చేసేముందు జాతీయ బీసీ కమిషన్‌కు ముసాయిదాను పంపి, వారి సూచనలు, సలహాలతో చట్టం చేయాలని నిర్ణయించారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో పనిదినాలు తక్కువగా ఉండటంతో ఈలోపు జాతీయ బీసీ కమిషన్ నుంచి ముసాయిదా పరిశీలన పూర్తయి రావడం కుదరదని భావిస్తున్నారు. దీంతో వచ్చే సమావేశాల్లోనో లేదా ఆర్డినెన్స్ ద్వారానో చట్టం చేసే అవకాశముంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఈచట్టం శిక్షలకు సంబంధించినది. ఈ అంశం రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం అనుమతి అవసరం.
ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు
బీసీల రక్షణ చట్టం ముసాయిదాను ఇప్పటికే బీసీ కమిషన్ అధికారులు సిద్ధం చేశారు. బీసీలపై సామాజిక బహిష్కరణ, దాడులు, దూషణలు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే ఏడాది నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొన్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు. చార్జిషీట్ దాఖలు నుంచి రెండు నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా రూపొందించారు. ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే, తీర్పు వెలువడిన 90 రోజుల్లో బాఽఽఽధితులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. గరిష్ఠంగా 180 రోజుల వరకు అవకాశం కల్పించారు. బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పడు, ఆ వ్యక్తికి మరణదండన లేదా జీవితఖైదు శిక్షపడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తారు. చార్జిషీట్ దాఖలు, విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఆర్నెల్ల నుంచి గరిష్ఠంగా సంవత్సరం పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కేసుల విచారణ సందర్భంగా బాధితులు, సాక్షులకు ప్రభుత్వం రక్షణ కలిస్తుంది. ప్రయాణం, పోషణ ఖర్చులు కూడా అందిస్తుంది.
బీసీ అట్రాసిటీ అంటే..
బీసీలను భయపెట్టడం, బహిరంగంగా అవమానించడం, కులం పేరుతో అవమానకర పదాలు లేదా సంకేతాలతో అవమానించడం, తక్కువ చేయడం. ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు, ఉపాధి, సేవలను నిరాకరించడం, సామాజిక బహిష్కరణకు గురిచేయడం, ప్రజాసేవల్లో వివక్ష అంటే.. విద్య, ఆరోగ్యం, ప్రజావనరులు, గృహవసతి కల్పనకు, ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం వంటివి బీసీ అట్రాసిటీగా పేర్కొన్నారు. చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం/భూమి నుంచి బలవంతంగా పంపడం, ప్రభుత్వ సేవలు, పథకాలు అందకుండా అడ్డుకోవడం, దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం, లైంగిక వేధింపులు, దాడులు చేయడం, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడటం, హాని చేసే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం, భూమి, పంటలు, పశువులు తదితరాలు ఆక్రమించడం, నివాసం, జీవనోపాధి, పంటలు దెబ్బతీయడం, మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం కూడా అట్రాసిటీనే. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో బీసీలకు అడ్డంకులు సృష్టించడం, రహదారులు, బావులు, ఘాట్లు, శ్మశానాలు, ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం, అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం కూడా నేరంగా భావిస్తారు.