రాజకీయ ఉనికి కోసం వైసీపీ నాయకుల పాట్లు
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:23 AM
రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు వరకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు.
మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు
టెక్కలి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు వరకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సందర్శన అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘నాడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాటమార్చారు. ఇప్పుడు జగన్ కొత్త డ్రామాకు తెరలేపాడు. వైసీపీకి ఇక అధికారం కలగానే మిగిలిపోతుంది. ఒక పత్రికను అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ విధ్వంసానికి పాల్పడే నాయకుడు. ఆయన ఏనాడైనా ప్రజా సమస్యలను పట్టించుకున్నాడా? ప్రతి మూడు నెలలకొకసారి సీఎం చంద్రబాబు పోర్టుల అభివృద్ధిపై సమీక్షిస్తున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టుపై రాజకీయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఈ పోర్టు పనులు ఇప్పటికే 76ు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఆఖరుకు మూలపేట పోర్టు పనులు పూర్తవుతాయి’ అని మంత్రులు పేర్కొన్నారు.