15 వరకు వినతులు: డెడికేటెడ్ కమిషన్
ABN , Publish Date - May 05 , 2026 | 06:47 AM
డెడికేటెడ్ కమిషన్‌కు వినతులు సమర్పించేందుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి డి.చంద్రశేఖర్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అమరావతి/రాజమహేంద్రవరం, మే 4 (ఆంధ్రజ్యోతి): డెడికేటెడ్ కమిషన్‌కు వినతులు సమర్పించేందుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి డి.చంద్రశేఖర్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న గడువును పలు బీసీ సంఘాల అభ్యర్థన మేరకు పొడిగించారు. ఆయా సంఘాలు, వ్యక్తులు స్వయంగా కమిషన్ దృష్టికి కాని, ఈ మెయిల్ ద్వారా కాని, విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పోస్టు ద్వారా కాని వినతి పత్రాలు అందించవచ్చని ప్రకటనలో తెలిపారు. బీసీల కులగణనతో పాటు వారి స్థితిగతుల అధ్యయనానికి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. కాగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమీక్ష సమావేశాన్ని, బహిరంగ విచారణను నిర్వహించారు. గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, బీసీలకు కేటాయించిన సీట్లు, గెలుపొందిన బీసీ అభ్యర్థులు వంటి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ విచారణలో స్వీకరించిన వినతులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.