బీసీ బిడ్డలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:59 AM
ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
పాలనలో వారు కీలక భూమిక పోషించాలి
ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత
బీసీ భవన్‌లో సివిల్స్ శిక్షణ కేంద్రం సందర్శన
బీసీ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశం
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను మంగళవారం మంత్రి సవిత సందర్శించారు. అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం బీసీ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నామని తెలిపారు. దానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, అందులో భాగంగా బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. బీసీలకు ఆర్థిక భరోసా కలిగించేలా ఆదరణ 3.0 పథకం అమలుకు నిర్ణయించామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తున్నామని, ఆ తర్వాత నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో బీసీ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారితో సహా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.