Share News

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:26 AM

ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మరట్వాడా, గుజరాత్‌ మీదుగా అరేబియాసముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

  • నేడు దక్షిణ కోస్తాలో వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మరట్వాడా, గుజరాత్‌ మీదుగా అరేబియాసముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 6.67, అనంతపురం జిల్లా ఉరవకొండలో 5.16, పెంజెరువులో 4.25, సోమలింగపాలెంలో 4, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా కణమాంలో 3.6, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, రామరాయుడిపాలెంలో 3.37, విజయనగరంలో 3.25, శ్రీకాకుళం జిల్లా లావేరులో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. జంగమహేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తాలోని బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, దానికి ఆనుకుని తిరుపతిలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది.

Updated Date - Jul 21 , 2026 | 06:29 AM