Share News

మళ్లీ తెరపైకి బాక్సైట్‌!

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:24 AM

దేశవ్యాప్తంగా 4,958 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వలు ఉన్నాయి. ఒడిసాలో అత్యధికంగా 41 శాతం నిల్వలు.. అంటే 2,057 మిలియన్‌ టన్నులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఉమ్మడి విశాఖ పరిధిలోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతం ....

మళ్లీ తెరపైకి బాక్సైట్‌!

  • మన్యంలోని ఆరు బ్లాకుల్లో 615 మిలియన్‌ టన్నుల నిల్వలు

  • మైనింగ్‌కు ఏపీఎండీసీకి లీజులివ్వాలి

  • నామినేషన్‌ లేదా వేలంలో ఇప్పించాలి

  • ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశవ్యాప్తంగా 4,958 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వలు ఉన్నాయి. ఒడిసాలో అత్యధికంగా 41 శాతం నిల్వలు.. అంటే 2,057 మిలియన్‌ టన్నులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఉమ్మడి విశాఖ పరిధిలోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతం (షెడ్యూల్డ్‌ ఏరియా)లో ఆరు బ్లాకులు.. చింతపల్లి, సప్పర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజ్‌ కొండల్లో సుమారుగా 615 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వలు ఉన్నాయి. 1980లోనే బాక్సైట్‌ నిల్వల గురించి జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) నివేదికలు ఇచ్చింది. బాక్సైట్‌ మైనింగ్‌ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందాల్లోని అక్రమాలు, ఆదివాసీల పోరాటాలే కారణం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని దట్టమైన అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ నిల్వలున్నాయి. ఇది షెడ్యూల్డ్‌ ఏరియా. నిబంధనల ప్రకారం మైనింగ్‌ ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్‌ లీజులు ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్‌ లీజులు దక్కాయి. ఏపీఎండీసీ మైనింగ్‌ బాధ్యతలు నేరుగా నిర్వహించదు కాబట్టి ప్రైవేటు కంపెనీలతో జతకట్టింది. దీంట్లో భాగంగా అరకు, సప్పర్ల ఏరియాల్లో మైనింగ్‌తోపాటు అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు జిందాల్‌ సౌత్‌వె్‌స్ట హోల్డింగ్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత చింతపల్లి అటవీప్రాంతంలోని జెర్రెల బ్లాకులో అల్యూమినియం రిఫైరీ ఏర్పాటుకు 2007లో రస్‌ఆల్‌ఖైమాతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత రస్‌ఆల్‌ఖైమా పెన్నా కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఆన్‌రాక్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఏపీఎండీసీ ఆన్‌రాక్‌తో బాక్సైట్‌ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. అనంతర కాలంలో కేంద్రం నుంచి అవసరమైన ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు, అందులోని అంశాలపై 2013లో కాగ్‌ ఓ సంచలన నివేదిక ఇచ్చింది. అనేక లోపాలను ఎత్తిచూపింది. ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం (ఈవోఐ) లేకుండా.. ఏపీఎండీసీకి తీవ్రస్థాయిలో నష్టం జరిగేలా ఒప్పందంలో క్లాజులున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేవలం 1.5 శాతం ఈక్విటీ ఇచ్చారని.. ఇలా పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఇది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు ఆన్‌రాక్‌ ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాటాలు చేశాయి. దీంతో ఆన్‌రాక్‌తో ఏపీఎండీసీ చేసుకున్న బాక్సైట్‌ ఒప్పందం ఆమోదానికి సంబంధించిన 222, 289 జీవోలను ప్రభుత్వం 2016లో రద్దుచేసింది. ఈ మేరకు జీవో 44 జారీ చేసింది. అలాగే.. ఏపీఎండీసీకి బాక్సైట్‌ బ్లాక్‌ లీజుల కేటాయింపును కూడా రద్దుచేస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. కేంద్ర గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం-2015లోని సవరించిన క్లాజుల ప్రకార ం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలపై ఆన్‌రాక్‌ హైకోర్టుల్లో, తర్వాత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. ఎక్కడా ఊరట లభించకపోవడంతో లండన్‌లోని ఆర్బిట్రేషన్‌ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది. ఒప్పందాల రద్దు వల్ల తనకు రూ.2,500 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. దీనిపై మార్చి 26న విచారణ జరుగనుంది.


సీఎంసీ పాలసీతో మళ్లీ కదలిక..

మరోవైపు.. కేంద్రం గనులు, ఖనిజాల రంగంలో సంచలన నిర్ణయం తీసుకుంది. క్రిటికల్‌ మినరల్స్‌ పాలసీ (సీఎంసీ)ని ప్రకటించింది అత్యంత అరుదైన ఖనిజాల మైనింగ్‌లో స్వయం సమృద్ధిని సాధించేలా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అరుదైన ఖనిజాల మైనింగ్‌ చేపట్టాలని నిర్ణయించింది. అంటే బీచ్‌శాండ్‌తోపాటు బాక్సైట్‌ కూడా ఇందులో భాగమే. ఈ నేపథ్యంలో గనుల శాఖ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బాక్సైట్‌ మైనింగ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. సీఎంసీలో భాగంగా రాష్ట్రంలో బాక్సైట్‌ మైనింగ్‌ చేపడితే.. అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుతోపాటు విలువ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని.. ఫలితంగా ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని జనవరి చివరి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా తెలిపింది.

ఖనిజాభివృద్ధి సంస్థ పేరిటే లీజులు..

అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలోని 6 బ్లాకుల్లో మైనింగ్‌ లీజులు నేరుగా గిరిజన ఆదివాసీలు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే ఇవ్వాలి. అందుచేత తన శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ పేరిట మైనింగ్‌ లీజులు ఇప్పించాలని గనుల శాఖ కోరింది. నామినేషన్‌ పద్దతిన లేదా వేలం విధానంలో అయినా లీజులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఏపీఎండీసీకి లీజులు ఇప్పిస్తే మైనింగ్‌, అల్యూమినియం రిఫైనరీల ఏర్పాటుకు అది డెవలపర్‌ను నియమించుకుంటుందని నివేదికలో పేర్కొంది. అంటే.. మైనింగ్‌ రంగంలో పేరున్న ప్రైవేటు కంపెనీతో ఒప్పందాలు చేసుకుని డెవలపర్‌గా ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం బీచ్‌శాండ్‌ కాంట్రాక్టులో భాగంగా అదానీ గ్రూపునకు చెందిన ‘అల్లూవియల్‌ హెవీ మినరల్స్‌’ కంపెనీని డెవలపర్‌గా నియమించుకుంది. బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో ఆ కంపెనీకి 90శాతం వాటా ఉండగా.. ఏపీఎండీసీకి 10 శాతమే ఉంది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. బాక్సైట్‌ మైనింగ్‌లోనూ డెవలపర్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని గనులశాఖ కోరుతోంది. అయితే లీజుల నిర్ణయాధికారం కేంద్రం పరిధిలో ఉంది. బాక్సైట్‌ లీజులను ఏపీఎండీసీకి ఇవ్వాలంటే తొలుత రాష్ట్రప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకోవాలి. ఏపీఎండీసీకి లీజులివ్వాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేయాలి. ఆ తర్వాత కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని కేంద్రానికి సిఫారసు చేస్తే ఏపీఎండీసీ పేరిట లీజులు మంజూరవడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Feb 16 , 2026 | 03:24 AM