బెరైటీస్ గోల్‌మాల్‌పై నేటి నుంచి విచారణ!
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:18 AM
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)కి నాసిరకం బెరైటీస్ సరఫరా చేశారన్న ఆరోపణల నిగ్గుతేల్చేందుకు గనులశాఖ సిద్ధమైంది.
2019-2025 మధ్య ఓఎన్‌జీసీకి సరఫరాపై ఆరోపణలు
వాస్తవాలను నిగ్గుతేల్చనున్న ముగ్గురు సభ్యుల కమిటీ
విచారణను దారి మళ్లించేందుకు ఓ నాయకుడి యత్నం
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)కి నాసిరకం బెరైటీస్ సరఫరా చేశారన్న ఆరోపణల నిగ్గుతేల్చేందుకు గనులశాఖ సిద్ధమైంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ముగ్గురు సీనియర్ అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం నుంచి సమగ్ర విచారణ ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇటు ఏపీఎండీసీ, అటు గనుల శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న బెరైటీస్ కొనుగోలు, సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకొని పరిశీలన చేయనుంది. 2019-2025 మధ్యకాలంలో ఓన్‌జీసీకి బీ-గ్రేడ్ బెరైటీస్(4.10 రకం)ను సరఫరా చేసిన ప్రైవేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి ఎంత మొత్తంలో బీ-గ్రేడ్ (4.1రకం) బెరైటీస్ కొన్నాయి? కేంద్రసంస్థకు ఏ పౌడర్ సరఫరా చేశాయి? తదితర అంశాలపై అధికారులు మదింపు చేయనున్నారు. విచారణలో భాగంగా ఓఎన్‌జీసీ సంస్థను కూడా సంప్రదించనున్నారు. అధికారికంగా టెండర్ దక్కించుకున్న సంస్థలు ఏ మేరకు బీ-గ్రేడ్ బెరైటీస్ ను సరఫరా చేశాయో ఆయా సంస్థల నుంచే సమాచారం తీసుకొని, ఏపీఎండీసీ, డీఎంజీ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న డేటాతో సరిపోల్చి వాస్తవాలను తేల్చనున్నారు. వాస్తవానికి మినరల్ డీలర్ లైసెన్స్ (ఎండీఎల్) ద్వారా మంగంపేటలో ఉన్న పరిశ్రమలు, కంపెనీలు, పల్వరైజింగ్ మిల్లులు ఎండీసీ నుంచి ఎంతమేర బీ-గ్రేడ్ బెరైటీస్ కొన్నాయి? వాటిని ఏం చేశాయన్న లెక్కలు ఉన్నాయి. వీటిద్వారా ఓఎన్‌జీసీ టెండర్ దక్కించుకున్న కంపెనీలు గత ఐదేళ్లలో ఎండీసీ నుంచి కొన్న బీ-గేడ్ర్ బెరైటీస్ ఎంత? ఓఎన్‌జీసీకి సరఫరా చేసినదెంతఅన్నది సులువుగా తేలిపోతుంది. వీటిని అధికారులు పరిశీలన చేస్తారు. కాగా, అధికారులతో కూడిన మరో బృందం సోమవారం మంగంపేటకు వెళ్లనున్నారని తెలిసింది. ఇదిలాఉంటే, కొన్ని కంపెనీలకు కొమ్ముకాసేలా విజిలెన్స్ విచారణను దారిమళ్లించడానికి ఓ నాయకుడు తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారు. ఓఎన్‌జీసీ టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై కాకుండా, మిగతా అంశాల వల్ల దారుణాలు జరిగిపోతున్నాయంటూ విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.