4కోట్లతో బాపూజీనగర్ అభివృద్ధి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:18 AM
నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలోని బాపూజీనగర్ ప్రాంతం అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సొంతంగా నిధులు
ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటన
కావలిలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా..’ కార్యక్రమం
రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్యలు ప్రస్తావించిన జనం
నెల్లూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలోని బాపూజీనగర్ ప్రాంతం అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు ఈ నిధులతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ‘అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సోమవారం రాత్రి కావలిలోని బాపూజీనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. స్థానికులు తమ సమస్యలు తెలియజేశారు. శివారు ప్రాంతం కావడంతో రోడ్లు, డ్రైన్లు లేవని, తాగునీటి సమస్య, రాత్రిపూట దొంగల బెడద ఎక్కువగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వీధిలైట్లు లేక రాత్రిళ్లు రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పందించారు. రూ.4కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తన సొంత నిధులు రూ.లక్ష అందజేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్ హరికృష్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మండపేటలో చేతిపంపులకు మరమ్మతులు
మండపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ఈ నెల 14న ‘అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమ వార్డులోని చేతిపంపులు పనిచేయడం లేదని మంచినీటి సమస్య ఉందని వార్డు మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ డీఈఈ శ్రీనివాస్, ఏఈ పవన్‌కుమార్ 17వ వార్డు మాండ్రువారివీధిలో పాడైన చేతిపంపును సోమవారం పునరుద్ధరించారు. అలాగే నాయుళ్లవీధి, అన్నపూర్ణమ్మవీధిలోని చేతి పంపులకు మరమ్మతులు చేసి మంచినీరు వచ్చేలా చేశారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.