అర్ధరాత్రి అలజడి!
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:14 AM
దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బాపట్ల శివారులోని నల్లమడవాగు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో చైను లాగి రైలు దోపిడీకి పాల్పడ్డారు.
బాపట్ల సమీపంలో మరో రైలు దోపిడీ
బండిలోనే వచ్చి.. చైన్‌లాగి రైలు ఆపిన దుండగులు
అర్ధరాత్రి దాటాక సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
ఇద్దరు ప్రయాణికుల నుంచి 75 గ్రాముల బంగారం అపహరణ
ప్రతిఘటించిన ఎస్కార్ట్ పోలీసులు.. రాళ్లు రువ్విన దుండగులు
క్షణాల్లో అక్కడికొచ్చిన జీఆర్‌పీ పోలీసులు.. పది రౌండ్ల కాల్పులు
తప్పించుకున్న దుండగులు.. పోలీసుల అదుపులో ఒక నిందితుడు
నిందితులంతా రాజస్థాన్‌కు చెందినవారేనని ప్రాథమిక నిర్ధారణ
బాపట్ల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బాపట్ల శివారులోని నల్లమడవాగు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో చైను లాగి రైలు దోపిడీకి పాల్పడ్డారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను చైన్ లాగి ఆపేసిన దుండగులు.. బీ-3, 6 బోగీల్లోని ఇద్దరు ప్రయాణికుల నుంచి 75 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు జీఆర్‌పీ పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరంతా బండిలోనే వచ్చి.. రైలు బాపట్ల దాటగానే చైన్‌లాగి ఆపేశారు. ప్రయాణికుల ఆభరణాలను లాక్కొంటుండగా.. రైలులో ఉన్న ఎస్కార్ట్ సిబ్బంది అప్రమత్తమై దుండగులను ప్రతిఘటించారు. అయితే.. అప్పటికే ఇద్దరు ప్రయాణికుల బంగారు ఆభరణాలను లాక్కొన్న దుండగులు.. రైలు దిగి పోలీసుల మీద రాళ్లు రువ్వారు. పోలీసులు కేకలు వేస్తూ వారిని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా.. ఆ అలికిడికి సమీప అప్పికట్ల స్టేషన్‌లో గస్తీ నిర్వహిస్తున్న జీఆర్‌పీ పోలీసులు అప్రమత్తమై ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనను వెంటనే పసిగట్టి దుండగులపై పది రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే చీకటిలో గురితప్పడంతో నలుగురు గుంటూరు వైపు, మరో ఇద్దరు బాపట్ల వైపు పరారయ్యారు. పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అందులో ఒకరికి ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దోపిడీకి పాల్పడిన వారంతా రాజస్థాన్‌కు చెందిన వారుగా విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో 18 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ఈ ముఠా భారీ దోపిడీకి స్కెచ్ వేసినప్పటికీ రైల్వే పోలీసులు కాల్పులు జరపి నష్టాన్ని తగ్గించగలిగారు. దుండగులు రాళ్లు విసరడం, పోలీసులు వారి మీద కాల్పులు జరపడం ఇదంతా.. దాదాపు ఐదు నిమిషాల పాటు నడిచింది. ప్రయాణికుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన జీఆర్‌పీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
రెండు నెలల వ్యవధిలో..
సరిగ్గా రెండు నెలల క్రితం బాపట్ల శివారు పరిధిలోని అప్పికట్ల-గుడిపూడి మధ్య బెంగళూరు నుంచి నరసాపురం వెళుతున్న ప్రత్యేక రైలులో దోపిడీ జరిగింది. దుండగులు పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు అపహరించారు. ఆ కేసు విచారణ ఓ కొలిక్కి రాకముందే సరిగ్గా అదే తరహాలో అప్పికట్ల స్టేషన్‌కు ముందు నల్లమడవాగు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దోపిడీకి తెగబడ్డారు. రెండు నెలల వ్యవధిలో మూడు రైలు చోరీలు జరగ్గా ఇవన్నీ బాపట్ల-విజయవాడ రైలు మార్గంలోనే జరగడం గమనార్హం. బాపట్ల జిల్లా పరిధిలో రెండు జరగ్గా, ఇంకొటి గుంటూరు జిల్లా పరిధిలోని నిడుబ్రోలు సమీపంలో జరిగింది. గతంలో జరిగిన రైలుదోపిడీల విషయంలోనే ఎలాంటి క్లూలూ దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటే.. తాజాగా దుండగులు ఇంకో దోపిడీకి పాల్పడి వారికి సవాల్ విసిరారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌తో పాటు విజయవాడ డివిజనల్ ఆర్‌పీఎఫ్ ఎస్పీ షణ్ముగం, జీఆర్‌పీ డీఎస్పీ అక్కేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
క్లూ దొరికింది.. ఈసారి తప్పించుకోలేరు..
గతంలో జరిగిన రెండు దోపిడీల్లో ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. కానీ తాజా ఘటనలో కంగారులో అక్కడే వదిలేసిన ఇద్దరి బ్యాగులను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల వైపు పరుగు తీసిన ఇద్దరు దుండగులను వెంబడించిన రైల్వే పోలీసులు చీరాల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో జరిగిన దోపిడీలతో పోల్చుకుంటే ఈ ఘటనలో ఆధారాలు లభించాయని, విచారణ వేగంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుందని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని జీఆర్‌పీ పోలీసులు చెబుతున్నారు.
అక్కడే ఎందుకంటే?..
బాపట్ల-విజయవాడ రైలు మార్గంలో అప్పికట్ల రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్‌కు సమీపంలో జనసంచారం తక్కువగా ఉండడంతో పాటు నివాసాలూ తక్కువే. దీంతో వెంటనే పారిపోవడానికి గుంటూరు వెళ్లే రహదారి అనువుగా ఉంటుంది. జన సంచారం తక్కువగా ఉండడం, పరారవడానికి అనువుగా ఉండడం వల్లే దుండగులు ఈ మార్గంలో దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.