ప్రాణం తీసిన కేబుల్
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:19 AM
కేబుల్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ ప్రాధానోపాధ్యాయుడి ప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డుకు అడ్డంగా వేలాడిన కేబుల్ బైక్‌పై వెళ్తున్న ఆయన మెడకు చుట్టుకోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డుకు అడ్డంగా వేలాడిన కేబుల్ మెడకు తగిలి.. బైక్ నుంచి కిందపడి ప్రధానోపాధ్యాయుడు మృతి.. బాపట్ల జిల్లాలో దుర్ఘటన
గవినివారిపాలెం (చీరాల), ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): కేబుల్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ ప్రాధానోపాధ్యాయుడి ప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డుకు అడ్డంగా వేలాడిన కేబుల్ బైక్‌పై వెళ్తున్న ఆయన మెడకు చుట్టుకోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా, చీరాల మండలం గవినివారిపాలెం సమీపంలో మంగళవారం దుర్ఘటన చోటుచేసుకొంది. పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన అంగిరేకుల శ్రీనివాసరావు (58) గవినివారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. బాపట్లలో స్థిరపడిన ఆయన నిత్యం ద్విచక్రవాహనంపై గవినివానిపాలేనికి వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరారు. 8:45 సమయంలో దేవినూతల-గవినివారిపాలెం మధ్య రోడ్డుకు అడ్డంగా గాలిలో వేలాడుతున్న ఏపీ ఫైబర్ కేబుల్ ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేశారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు ఆకస్మిక మరణంతో చిన్నారులు, ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రామాల్లో అనేకచోట్ల కేబుల్స్ రోడ్లకు అడ్డంగా వేలాడుతున్నాయని, వాటిని పర్యవేక్షించాల్సిన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి.