Share News

‘సర్వే’లో కీచకుడు

ABN , Publish Date - May 25 , 2026 | 05:21 AM

సర్వే శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి మహిళా ఉద్యోగుల పట్ల కీచకుడిగా మారాడు. గత పదేళ్లలో ఆయనపై ఏకంగా 20కిపైగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి.

‘సర్వే’లో కీచకుడు

  • బాపట్ల జిల్లాలో ఓ అధికారిపై పదేళ్లలో 20కిపైగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు

  • తాజాగా ఓ గ్రామ ఉద్యోగినికి వేధింపులు

  • మాట విననందుకు బాధితురాలు బదిలీ..

  • ఆ తర్వాత పెళ్లి జరగకుండా అడ్డు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సర్వే శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి మహిళా ఉద్యోగుల పట్ల కీచకుడిగా మారాడు. గత పదేళ్లలో ఆయనపై ఏకంగా 20కిపైగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ఓ గ్రామ సర్వే ఉద్యోగినికి లైంగిక వేధింపులతో నరకం చూపించాడు. అవమాన భారంతో బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. సర్వే, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలికి తన గోడు చెప్పుకొనే నాథుడే కనిపించడం లేదు. బాపట్ల జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్వే అధికారిపై గత పదేళ్ల కాలంలో పలుమార్లు లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. ఆయన డబ్బుతో వాటిని సెటిల్‌ చేసుకున్నారు. తాజాగా ఓ గ్రామ సర్వే ఉద్యోగిని తన మాట వినకపోవడంతో సుదూర గ్రామానికి బదిలీ చేయించారు. తర్వాత బదిలీ లేకుండా చేయిస్తానని చెప్పి ఓ రోజు తన సర్వీసు ఫైలుతో సహా ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడంతో ఆ ఉద్యోగిని ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా డివిజనల్‌ స్థాయి రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చారు. ఆ అధికారి నిందితుడిపై చర్యలకు సిఫారసు చేయకుండా... అతడిని, బాధితురాలిని తన ఆఫీసుకు పిలిపించి సెటిల్‌మెంట్‌ చేశారు. ఆమె ఆత్మగౌరవానికి రూ.2 లక్షలు ఖరీదు కట్టి, ఆ డబ్బు ఇవ్వాలని సర్వే అధికారికి చెప్పారు. ఆయన డబ్బు ఇవ్వడం అటుంచి.. ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల ఆ ఉద్యోగినికి నిశ్చితార్థం జరిగింది.


అయినా అధికారి వేధింపులు ఆపలేదు. ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తి వివరాలు తెలుసుకుని.. ఆమె క్యారెక్టర్‌ మంచిదికాదని, ఆమె పై అధికారే పదేపదే చెబుతున్నారని, అందుకే పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. దీంతో బాధితురాలు మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ ద ళిత సంఘం ప్రతినిధి ఆ మహిళా ఉద్యోగినికి జరిగిన అన్యాయాన్ని వివరిసూ సర్వే అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏప్రిల్‌లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అందులో ఆ సర్వే అధికారి ఫోన్‌లో ఉద్యోగినికి పంపించిన మెసేజ్‌లు, వాట్సప్‌ సందేశాలు, ఇతర సమాచారాన్ని జోడించారు. అదే కాపీని రెవెన్యూలోని మరో కీలక అధికారికి కూడా పంపించారు. ఫిర్యాదు తీసుకున్న ఓ అధికారి బాధితురాలికి న్యాయం చేయకుండా.. ఆ ఫిర్యాదును అడ్డు పెట్టుకొని సర్వే అధికారితో సెటిల్‌మెంట్‌ చేసుకున్నారని తెలిసింది. ఇదే కీచక అధికారిపై మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మరో నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. అసభ్య పదజాలం వాడటం, బూతులు తిట్టడం, రాత్రిళ్లు ఫోన్లు చేసి వేధించడం వంటివి చేస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలని అధికారులు నివేదికలు ఇచ్చారు.

Updated Date - May 25 , 2026 | 05:23 AM