భానుడు భగభగ
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:10 AM
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ వాటి ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం ఇంకా ఏర్పడలేదు.
సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు
బాపట్లలో 41.6 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ వాటి ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం ఇంకా ఏర్పడలేదు. ఎండ తీవ్రతకు అడపాదడపా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండడంతో చాలాచోట్ల వేడి వాతావరణం, ఎండప్రభావం, ఉక్కపోత అధికంగా ఉన్నాయి. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్న సమయంలో కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. బాపట్లలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, ఒంగోలులో 41, కావలిలో 40.5, తిరుపతిలో 40.2, జంగమహేశ్వరపురంలో 40, అమరావతిలో 39.7 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో ఎండ తీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది. రుతుపవనాలు మళ్లీ పుంజుకునేందుకు మూడు, నాలుగు రోజులు పడుతుందని, అప్పటి వరకు ఎండతీవ్రత ఉంటుందని తెలిపింది. కాగా, బుధవారం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.