Share News

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు

ABN , Publish Date - May 24 , 2026 | 04:06 AM

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దయింది. కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న అంశానికి బాపట్ల కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ముగింపు పలికారు. ఇకపై క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు ఆ హోదా దక్కదని దీంతో తేల్చి చెప్పినట్లయింది.

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు

  • బాపట్ల కలెక్టర్‌ కీలక ఉత్తర్వులు

  • క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు

  • గతంలోనే హైకోర్టు తీర్పు.. సుప్రీం సమర్థన

  • స్ర్కూటినీ కమిటీ రద్దు సిఫారసు పరిగణన

  • అంతా నిబంధనల ప్రకారమే: కలెక్టర్‌ వినోద్‌

  • ధర్మమే గెలిచింది: పిటిషనర్‌ అక్కల రామిరెడ్డి

  • ఉత్తర్వులు అందాక నిర్ణయం: పాస్టర్‌ ఆనంద్‌

  • ప్రభుత్వం ముందు అప్పీల్‌ చేసుకునే అవకాశం

బాపట్ల, మే 23(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దయింది. కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న అంశానికి బాపట్ల కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ముగింపు పలికారు. ఇకపై క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు ఆ హోదా దక్కదని దీంతో తేల్చి చెప్పినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జిల్లా స్థాయిలో పలు విడతలుగా జరిగిన విచారణ తర్వాత కలెక్టర్‌ ఈ కీలక నిర్ణయ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను శనివారం విడుదల చేశారు. రద్దుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ సోమవారం జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు సంబంధించిన కలెక్టర్‌ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చేలా రెవెన్యూ విభాగం కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్‌తో పాటు మ్యానువల్‌గా కూడా రికార్డుల్లో హోదాను రద్దు చేయనున్నారు. మరోవైపు ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వులను సామాజిక సంక్షేమ శాఖ, సంబంధిత విభాగాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.


ఇదీ నేపథ్యం..

2021 జనవరి 24న అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగమైన పిట్టలవానిపాలెం మండల పరిధిలోని కొత్తపాలెంలో ఓ ఇంట్లో ప్రార్థనలు నిర్వహించి తిరిగి వెళుతుండగా తనపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఆనంద్‌ ఫిర్యాదులో క్రైస్తవుడినని పేర్కొన్నారని, మతం మారితే అట్రాసిటీ చట్టం ఎలా వర్తింస్తుందని, ఆ కేసును కొట్టివేయాలని రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తప్పుడు కేసుకు సహకరించిన డీఎస్పీ, ఎస్సై, ఆర్డీవో, తహసీల్దార్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని అక్కల న్యాయపోరాటం చేశారు. ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే వెంటనే ‘ఎస్సీ హోదా’ను కోల్పోతారని 2025 ఏప్రిల్‌ 30న హైకోర్టు తేల్చి చెప్పింది. పాస్టర్‌ ఆనంద్‌ ఫిర్యాదుతో రామిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై నమోదైన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఆనంద్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు తీర్పునే సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు గత మార్చి 24న ఉత్వర్వులు వెలువరించింది.


కలెక్టర్‌ చెంతకు చేరాక

హైకోర్టు తీర్పు ఆధారంగా ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు చేయాలని అక్కల రామిరెడ్డి గతేడాది ఏప్రిల్‌లోనే బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం ఎస్సీ హోదా వివాదాన్ని పరిష్కరించడానికి జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్ర్కూటినీ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏప్రిల్‌ 18న చేపట్టిన తొలి విచారణకు ఆనంద్‌ గైర్హాజరయ్యారు. ఈ నెల 1న జరిగిన విచారణలో ఆనంద్‌, రామిరెడ్డి కూడా హజరయ్యారు. విచారణ ముగియడంతో ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు సబబేనంటూ స్ర్కూటినీ కమిటీ ఈ నెల 2న సిఫారసు చేసింది. తన వాదన చెప్పుకోవడానికి రెండు వారాలు గడువిస్తూ ఆనంద్‌కు కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఆ గడువు మే 19న ముగుస్తుండడంతో అదే రోజు ఆనంద్‌ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ముందు హాజరై తాను ఎస్సీనేనని పలు పత్రాలను అందించారు. అనంతరం ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు చేస్తూ బాపట్ల్ల కలెక్టర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


అన్నీ నిర్ధారించాకే..

ఎస్సీ హోదా రద్దు అంశానికి సంబంధించి బాపట్ల కలెక్టరేట్‌ వేదికగా జరిగిన విచారణతో పాటు ప్రక్రియపై ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఎప్పటికప్పుడు నివేదించారు. రూల్‌ ప్రొసీజర్‌ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా మొత్తం ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు. అనేక కోణాల్లో ఈ అంశంపై కసరత్తు చేశారు. ప్రొసీడింగ్స్‌ ముసాయిదా కాఫీని శనివారం ఉదయమే న్యాయనిపుణుల వద్దకు పంపించారు. అన్నీ నిర్ధారించుకున్నాకే ఆనంద్‌ ఎస్సీ హోదాను రద్దు చేశారు. అయితే ఆయనకు ఇంకా అప్పీల్‌ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్‌ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని ఆనంద్‌ సాంఘిక సంక్షేమ శాఖ ఎదుట సవాల్‌ చేసుకునే వీలుంది. దీంతో పాటు ఇప్పటికే ఆనంద్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడంతో పాటు విచారణకు సంబంధించి తన వాదన చెప్పుకొనేందుకు స్ర్కూటినీ కమిటీ తగిన సమయం ఇవ్వలేదని హైకోర్టులో కూడా పిటిషన్‌ వేసినట్లు సమాచారం. మరోవైపు హైకోర్టు ఉత్వర్వుల అమలులో జాప్యం జరుగుతోందని అక్కల రామిరెడ్డి కూడా గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - May 24 , 2026 | 04:07 AM