Share News

అమ్మ దొంగా!

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:55 AM

అతనో బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు బ్యాంకు దోపిడీకి ప్లాన్‌ వేశాడు.

అమ్మ దొంగా!

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలు.. దొంగలా మారిన బ్యాంకు ఉద్యోగి

  • సెక్యూరిటీ తక్కువున్న బ్రాంచ్‌ ఎంపిక

  • సుత్తితో వచ్చి సిబ్బందిపై దాడి

  • మేనేజర్‌ అప్రమత్తతతో పట్టుబడిన వైనం

విశాఖపట్నం/కంచరపాలెం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అతనో బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు బ్యాంకు దోపిడీకి ప్లాన్‌ వేశాడు. తాను పని చేసే బ్యాంకుకే చెందిన... సెక్యూరిటీ తక్కువగా ఉన్న బ్రాంచిని ఎంచుకున్నాడు. పలుమార్లు ఆ బ్రాంచ్‌కు వెళ్లి అనువైన సమయం కోసం ఆరా తీశా డు. బుధవారం రాత్రి ప్లాన్‌ను అమలు చేయబోయి పోలీసులకు పట్టుబడ్డాడు. విశాఖ నగరం కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ విభాగంలో ఎల్లా రవికుమార్‌(40) పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడితో విశాఖనగరంలోని సీతంపేటలో నివాసం ఉంటూ రోజూ నగరం నుంచి బ్యాంకుకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడి భారీ గా డబ్బులు పోగొట్టుకున్నాడు. సుమారు రూ.65 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు బ్యాంకు దోపిడీకి ప్లాన్‌ వేశాడు. తమ బ్యాంకుకు చెందిన విశాఖనగరంలోని కంచరపాలెం ఐటీఐ కూడలి బ్రాంచ్‌లో పెద్దగా సెక్యూరిటీ లేకపోవడం గుర్తించాడు. రాత్రి ఏడు గంటల సమయంలో సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోతే, మేనేజర్‌, క్యాషియర్‌ మాత్రమే ఉంటారని తెలుసుకున్నాడు. ప్లాన్‌ అమలులో భాగంగా గత కొద్ది రోజులుగా ఆ బ్రాం చిని సందర్శిస్తూ సిబ్బంది, మేనేజర్‌తో మాటలు కలిపి దగ్గరయ్యాడు. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ప్యాంటు వెనుక సుత్తిపెట్టుకుని బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో మేనేజర్‌ బెండి శివరామరాజు, క్యాషియర్‌ రమేశ్‌ మాత్రమే ఉన్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో నగదు, బంగారం లెక్కలు చూసుకుని, చెస్ట్‌లో భద్రపరిచేందుకు వారిద్దరూ లాకర్‌రూమ్‌లోకి వెళ్లారు. లాకర్‌రూమ్‌ తాళం తీయగానే అదనుకోసం వేచిఉన్న రవికుమార్‌ సుత్తితో వారిద్దరి తలలపై మోదాడు. మేనేజర్‌ శివరామరాజు వెంటనే లాకర్‌రూమ్‌ తాళాన్ని తిరిగి వేసేసి గట్టిగా కేకలు వేశారు. దీంతో భయపడిన రవికుమార్‌ బయటకు పారిపోయాడు. బ్యాంకు ఒక కల్యాణమండపంపై అంతస్థులో ఉంది. కల్యాణమండపం బయట నిలబడి మాట్లాడుకుంటున్న కొందరు ఆ కేకలు విని రవికుమార్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కంచరపాలెం సీఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గాయపడిన మేనేజర్‌, క్యాషియర్‌లను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా పట్టుబడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఫోన్‌ వదిలేసి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

5.jpg

Updated Date - Jun 05 , 2026 | 05:55 AM