అరటికి.. యుద్ధం దెబ్బ!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:33 AM
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం.. అరటి రైతుల ఆయువు పట్టుమీద దెబ్బ కొట్టింది. ఎగుమతులు నిలిచిపోయి.. ధర పతనమై 15 రోజుల్లోనే వారి తలరాతలు మారిపోయాయి.
ఆగిన ఎగుమతులు.. పతనమైన ధరలు
ఇటీవలి వరకు టన్ను 20 నుంచి 23 వేలు
ప్రస్తుతం 6 నుంచి 8 వేలలోపే ధర
ప్రతినెలా గల్ఫ్‌కు 100 కంటైనర్ల ఎగుమతి
ఇప్పుడు అవి ఆగడంతో రైతన్నకు కష్టాలు
(పుట్లూరు-ఆంధ్రజ్యోతి)
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం.. అరటి రైతుల ఆయువు పట్టుమీద దెబ్బ కొట్టింది. ఎగుమతులు నిలిచిపోయి.. ధర పతనమై 15 రోజుల్లోనే వారి తలరాతలు మారిపోయాయి. అనంతపురం జిల్లాలో ఈ సీజన్‌లో 38,984 ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేశారు. యుద్ధానికి ముందు టన్ను ధర రూ.20వేల నుంచి 23వేలు పలికింది. ప్రస్తుతం యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అరటి కాయల కంటైనర్ల రవాణా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా ధర టన్ను రూ.6వేలకు పడిపోయింది. అనంతపురం జిల్లా నుంచి అరబ్ దేశాలకు ప్రతినెలా సుమారు 100 కంటైనర్లలో అరటికాయలు ఎగుమతి చేసేవారు. ఎక్కువగా పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, నార్పల తదితర మండలాల నుంచి కంటైనర్లలో రవాణా చేసేవారు. గతంలో తాడిపత్రి నుంచి నేరుగా కంటైనర్లలో లోడింగ్ చేసి రైలులో ఎగుమతి చేసేవారు. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో సరుకు వెనక్కి తీసుకువచ్చి వేరే ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలుస్తోంది. అరటి కావాలని వ్యాపారులు.. రైతులను అడిగే పరిస్థితులు లేవని వాపోతున్నారు. మొదటిదశ కాయలను కూడా తక్కువ ధరకు అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. మరికొన్నిచోట్ల పంట పాకానికి రావడంతో వదిలేయాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
వ్యాపారులు అడగడం లేదు
ఏడెకరాల్లో సుమారు రూ.8లక్షలు పెట్టుబడి పెట్టి అరటి సాగుచేశా. పంట కోత దశకు వచ్చింది. వ్యాపారులను ఫోన్‌చేసి అడుగుతున్నా.. కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. రెండురోజుల కిందట ఓ వ్యాపారి మొదటి దశపంటను రూ.5వేలకు అడగడంతో విక్రయించలేదు. యుద్ధం ఆగితే తప్ప.. రైతుల పరిస్థితి చక్కబడేలా లేదు.
- రవికుమార్‌నాయుడు, బాలాపురం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా
8 ఎకరాల పంట వదిలేయాల్సి వస్తోంది
8ఎకరాల్లో 10వేల అరటిచెట్లు సాగు చేశా. మొదట దశ కోత ఉంది. టన్ను రూ.5వేలకు అడుగుతున్నారు. కనీసం 10వేలు అమ్మితేనే మందులు, ఎరువుల ఖర్చు వస్తుంది. వ్యాపారులు రాకపోతే పంటను వదిలేయాల్సిందే. యుద్ధం వల్ల రైతులు నష్టపోతారని అనుకోలేదు. ఈ ధరలకు అమ్మితే పెట్టుబడులు కూడా రావు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.
- వేణు, సూరేపల్లి, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా
మార్చి నుంచి ధరలు తగ్గుతున్నాయి
మార్చి ప్రారంభం నుంచి జిల్లాలో అరటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రంజాన్ నెలలో అరటి ధరలు బాగా ఉంటాయని భావించాం. పంట నాణ్యత కూడా బాగుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను ధర రూ.22వేల నుంచి 25వేలకు పలికింది. యుద్ధంతో ఇరాన్, ఇరాక్‌కు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా అరటిని ఎగుమతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. ధరలు తగ్గడంపై స్థానిక వ్యాపారులతో చర్చించాం. ఢిల్లీకి రోడ్డు ద్వారా రవాణా ఖర్చు పెరగడంతో ధరలు గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. నెలాఖరు తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.
- ఉమాదేవి, ఉద్యాన శాఖ అనంత జిల్లా అధికారి