Share News

అరటి రైతుకు యుద్ధం దెబ్బ

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:27 AM

అనంతపురం రైతులు పండించే అరటి పంట ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఏటా లక్ష టన్నుల అరటి అక్కడకు వెళుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు అరటి పంటను కోలుకోలేని దెబ్బతీశాయి.

అరటి రైతుకు యుద్ధం దెబ్బ

  • యుద్ధంతో ఆగిన లక్ష టన్నుల ఎగుమతులు

  • భారీగా పడిపోయిన ధరలు

  • అనంతలో టన్ను 5వేలు లోపే

(అనంతపురం - ఆంధ్రజ్యోతి)

అనంతపురం రైతులు పండించే అరటి పంట ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఏటా లక్ష టన్నుల అరటి అక్కడకు వెళుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు అరటి పంటను కోలుకోలేని దెబ్బతీశాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. యుద్ధానికి ముందు ఈ జిల్లాలో టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.23 వేలు పలికింది. ఇప్పుడు టన్ను రూ.6 వేలు- రూ.8 వేలు మధ్య ఉంది. అనంతపురం జిల్లాలో 40 వేల ఎకరాల్లో అరటి పంట సాగవుతోంది. ఏడాదికి 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాల్లో అరటి పంట తోటల్లోనే ఉంది. నాణ్యతను బట్టి వ్యాపారులు టన్నుకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


ధరలు భారీగా పడిపోయాయి..

‘‘యుద్ధంతో అరటి ధరలు భారీగా పడిపోయాయి. గతంలో ఎన్నడూలేని విధంగా అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాం. నేను మూడున్నర ఎకరాల్లో అరటి పంట సాగు చేశాను. ఎకరానికి రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టాను. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు మరింత తగ్గాయి. టన్ను అరటి రూ.4వేలు చొప్పున అమ్మాను.’’

- శివయ్యనాయుడు, చెర్లోపల్లి, పుట్లూరు మండలం

పెట్టుబడి కూడా తిరిగిరాలేదు

‘‘యుద్ధం ప్రభావంతో గల్ఫ్‌దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు అరటి ధరలను పూర్తిగా తగ్గించారు. ఐదు ఎకరాల్లో అరటి పంట సాగు చేసేందుకు రూ.5.50 లక్షలకు పైగా ఖర్చు అయింది. ఈసారి 85 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.5 వేలతో విక్రయించాను. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు’’.

- రైతు నాగేశ్వరరెడ్డి, కడవకల్లు, పుట్లూరు మండలం

Updated Date - Apr 26 , 2026 | 05:27 AM