Share News

Banakacherla Project: వద్దనుకున్న ప్రాజెక్టుకే జై!

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:08 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా.. సాంకేతిక ప్రతిబంధకాల దృష్ట్యా దానిని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది.

Banakacherla Project: వద్దనుకున్న ప్రాజెక్టుకే జై!

  • కేంద్ర అనుమతుల కోసం ‘బనకచర్ల’ కొనసాగింపు

  • అవి వచ్చాక నల్లమలసాగర్‌కే పరిమితం

  • ఇప్పటికే బనకచర్ల పీఎఫ్ఆర్‌ జలసంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌

  • అదే అలైన్‌మెంట్‌తో నల్లమలసాగర్‌ రిపోర్టును మళ్లీ అప్‌లోడ్‌ చేస్తే తిరస్కరణ తప్పదు

  • కేంద్ర ఆమోదం పొందేందుకు కసరత్తు

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా.. సాంకేతిక ప్రతిబంధకాల దృష్ట్యా దానిని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపకల్పన టెండర్‌ను ఐఐసీ-శ్రీరామ కన్‌స్ట్రక్షన్స్‌ కన్సార్షియం ఇప్పటికే దక్కించుకుంది. సాధారణంగా డీపీఆర్‌ తయారయ్యాక కేంద్ర వెబ్‌సైట్‌లో ఆ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పటికే పోలవరం-బనకచర్ల పథకం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌)ను దాదాపు అదే అలైన్‌మెంట్‌తో కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జల సంఘానికి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖలకు పంపారు. ఇవి సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టెక్నో-ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టు-టీఈఎ్‌ఫఆర్‌) ఇస్తాయి. సాంకేతికంగా ఒకసారి అలైన్‌మెంట్‌తో పీఎఫ్ఆర్‌ ను లేదా డీపీఆర్‌ను అప్‌లోడ్‌ చేస్తే.. అదే అలైన్‌మెంట్‌తో కొత్తగా మరో డీపీఆర్‌ను సాఫ్ట్‌వేర్‌ ఆమోదించదు. తిరస్కరిస్తుంది. రాష్ట్ర జల వనరుల శాఖ ఈ సాంకేతిక అవరోధాన్ని గుర్తించింది. దీనిని అధిగమించాలంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సమర్పించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం పీఎ్‌ఫఆర్‌ను ఆమోదింపజేసుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చింది. పోలవరం-నల్లమలసాగర్‌ పథకాన్ని మూడు దశలో చేపట్టేందుకు రూ.58,700 కోట్లు ఖర్చవుతుంది. అదే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి రూ.81900 కోట్లు వ్యయమవుతుంది.


ఇప్పటికే బనకచర్ల పథకాన్ని ఆమోదించాలని సీఎం చంద్రబాబు పలుసార్లు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, సీఆర్‌ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలతో ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. దాని బదులు పోలవరం-నల్లమలసాగర్‌ను రూ.58,700 కోట్ల అంచనాతో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు బనకచర్ల అనుసంధాన పథకం ఆమోదం పొందాక.. నల్లమలసాగర్‌ వరకే ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా అనుమతులు పొందాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. కడలిపాలయ్యే వరద జలాలను రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను నల్లమలసాగర్‌కు తరలించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం.

Updated Date - Jan 14 , 2026 | 05:08 AM