Share News

రైత్వారీ భూములకు.. రేపటి నుంచే నిషేధ విముక్తి

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:54 AM

రైతుల 13 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రైత్వారీ పట్టాలున్న భూములన్న రైతులు, వారి నుంచి ఇంతకు ముందే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వక అవస్థలు పడుతున్న వారి కష్టాలు తొలగిపోనున్నాయి.

రైత్వారీ భూములకు.. రేపటి నుంచే నిషేధ విముక్తి

  • రైతులను ఇంకా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు

  • నిరాటంకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు

  • వెబ్‌ల్యాండ్‌, రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

  • ఆటోమ్యుటేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో కూడా

  • ‘ఆంధ్రజ్యోతి’కి సీఎస్‌ సాయిప్రసాద్‌ వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రైతుల 13 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రైత్వారీ పట్టాలున్న భూములన్న రైతులు, వారి నుంచి ఇంతకు ముందే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వక అవస్థలు పడుతున్న వారి కష్టాలు తొలగిపోనున్నాయి. సోమవారం నుంచే ఆ భూములకు నిషేధ విముక్తి లభించనుంది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైత్వారీ పట్టాలున్న గ్రామ సర్వీసు ఇనామ్‌ భూములు 1.36 లక్షల ఎకరాలను ప్రీ హోల్డ్‌ చేస్తూ రెవెన్యూ శాఖ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చే సిన విషయం తెలిసిందే. ఇప్పుడేం జరగనుందన్న చర్చ రైతులు, అధికార వ ర్గాల్లో బయల్దేరింది. ఈ నేపథ్యంలో సీఎ్‌సను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. ఫ్రీ హోల్డ్‌ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయని.. ఆ భూములను నిషేధ విముక్తి చేయడానికి తొలుత రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల పరిధిలో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో.. అంటే ఇటు వెబ్‌ల్యాండ్‌, అటు రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌, ఆటోమ్యుటేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందని సాయిప్రసాద్‌ వివరించారు. ‘వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో గ్రామ సర్వీసు ఇనామ్‌ భూములు-రైత్వారీ పట్టా అని నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌లోనూ ఇనామ్‌ రైత్వారీ పట్టాలుగా నమోదుచేస్తారు. దీంతో ఆ భూములు 22ఏ నుంచి బయటకొస్తాయి. రిజిస్ట్రేషన్లకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఇంతకు ముందే రైత్వారీ పట్టాలున్న సర్వీసు ఇనాం భూములను కొన్నవారు వాటిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఎలాంటి అడ్డంకులు, అభ్యంతరాలు ఉండవు’ అని స్పష్టంచేశారు.


కొత్తగా రైత్వారీ పట్టాలున్న భూములను రైతులు ఇతరులకు అమ్ముకోవచ్చని, ఇతరులు వాటిని కొనుగోలుచేసి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. మరి ఆ భూముల మ్యుటేషన్‌ మాటేమిటన్న ప్రశ్నకూ ఆయన పరిష్కారం చూపించారు. ఆటోమ్యుటేషన్‌ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి రైత్వారీ పట్టాలున్న భూముల వివరాలను నమోదుచేస్తారని.. దీంతో ఆ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు సజావుగా సాగిపోతాయని, మ్యుటేషన్లు పద్ధతి ప్రకారం జరిగిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇంత స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా ఎవరైనా, ఎక్కడైనా రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విధానం అమలులో రైతులకు ఎక్కడా ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు సృష్టించకుండా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఎస్‌ తెలిపారు.

Updated Date - Apr 19 , 2026 | 04:56 AM