లడ్డూలో ఎంత తిన్నాడో తెలియదు
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:43 AM
తిరుమల లడ్డూలో ఆయన(వైవీ సుబ్బారెడ్డి) ఎంత తిన్నాడో నాకు తెలియదు. కానీ మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నాడు’ అని మాజీ మంత్రి,....
లోపల వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి నేనే
వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల లడ్డూలో ఆయన(వైవీ సుబ్బారెడ్డి) ఎంత తిన్నాడో నాకు తెలియదు. కానీ మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నాడు’ అని మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు లాయర్‌పేటలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి పేరు ఎత్తకుండానే బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వేంకటేశ్వరస్వామి పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో గతంలో నేను ఒంగోలు వచ్చినప్పుడు లడ్డూ విషయంపై అలా మాట్లాడాను. అయితే దానిని అడ్డంపెట్టుకొని నేను వైసీపీలో చేరుతున్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేశారు. వైవీ సుబ్బారెడ్డిని లోపల వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆయనను లోపల వేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే. ఒంగోలులో భూకబ్జాలు, ఇసుక, గ్రావెల్ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తున్నా. విషయాన్ని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికీ తీసుకెళ్తా. ఉచిత ఇసుకను ఇచ్చిన చంద్రబాబు పుణ్యాత్ముడైతే... ఒంగోలులో మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలులో బ్రాహ్మణుల స్థలాలను ఆక్రమించుకున్నానంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ స్థలాలతోపాటు ఐదింటిని ఒంగోలులో కబ్జా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెప్మాలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలి.’ అని బాలినేని పేర్కొన్నారు.