Share News

పాత కాంట్రాక్టర్లకే ‘బాలసంజీవని’

ABN , Publish Date - May 01 , 2026 | 04:13 AM

గర్భిణులకు పోషకాహారం అందించే బాలసంజీవని సరఫరా కాంట్రాక్టు టెండర్ల విషయంలో మహిళా శిశు సంక్షేమశాఖ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి.

పాత కాంట్రాక్టర్లకే  ‘బాలసంజీవని’

  • వారికి అనుకూలంగా టెండర్‌ నిబంధనల రూపకల్పన.. గతేడాది బాలామృతంపై కూడా ఇదే ధోరణి

  • కొందరు కోర్టుకెళ్లడంతో నాడు ఆగిన టెండర్లు

  • ఐదారుగురు కాంట్రాక్టర్ల సేవలో మహిళాశిశు సంక్షేమశాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గర్భిణులకు పోషకాహారం అందించే బాలసంజీవని సరఫరా కాంట్రాక్టు టెండర్ల విషయంలో మహిళా శిశు సంక్షేమశాఖ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. గతంలో సరఫరా చేసినవారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అనుకూలంగా నిబంధనలను రూపొందించారనే విమర్శలు వెల్లువెత్తాయి. గర్భిణులకు సరఫరా చేసే పోషకాహారాన్ని వివిధ వెరైటీలు సరఫరా చేసిన అనుభవం ఉన్న వారికి సాధారణంగా ఈ పథకం ద్వారా అర్హత కల్పించాల్సి ఉండగా, గత మూడేళ్లలో సరఫరా చేసిన వారినే మళ్లీ టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాల్లో ఏడాదికి 2347 టన్నుల బాలసంజీవని ఉత్పత్తి, సరఫరా చేసిన అనుభవముండాలంటూ నిబంధన పెట్టారు. బాలసంజీవనిలోని ఆరు సరుకుల్లో కనీసం మూడింటిని గత మూడేళ్లలో ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి ఉండాలని పేర్కొన్నారు. బిడ్డర్లకు గత మూడేళ్లలో ఏడాదికి ఏపీలోని 5583 డెలివరీ పాయింట్లలో సరఫరా చేసిన అనుభవం ఉండాలన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో గర్భిణులకు పోషకాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఈ బిడ్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. బిడ్‌ విలువలో 50 శాతం మేరకు ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో బాల సంజీవని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు తప్ప ఏ ఇతరులకు ఈ టెండర్లు దక్కే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో గతేడాదికి ఐదారుగురు కాంట్రాక్టర్లు జోన్ల వారీగా బాలసంజీవని ద్వారా గర్భిణులకు పోషకాహారాన్ని సరఫరా చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాదికి సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో గతంలో సరఫరా చేసినవారే పాల్గొనేలా నిబంధనలు రూపొందించడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఏడాదికి రూ.167 కోట్ల బాలసంజీవని సరఫరా...

బాలసంజీవని ద్వారా రాష్ట్రంలో గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఏడాదికి రూ.167 కోట్ల విలువైన పోషకాహారం అందిస్తున్నారు. జోన్‌-1 కింద ఉత్తరాంధ్ర జిల్లాల్లో సరఫరా చేసేందుకు రూ.39.16 కోట్లు, జోన్‌-2 కింద గోదావరి జిల్లాల పరిధిలో రూ.37.65 కోట్లు, జోన్‌-3 పరిధిలో రూ.37.34 కోట్లు, జోన్‌-4లో రాయలసీమ పరిధిలో రూ.53.12 కోట్ల మేరకు బిడ్లు వేసుకోవాలని టెండర్లు పిలిచారు. బాలసంజీవని కింద ఒక్కో గర్భిణికి నెలకు రాగి పిండి 2 కేజీలు, బెల్లం 250 గ్రాములు, వేరుశనగ చిక్కీ 250 గ్రాములు, ఒక కేజీ అటుకులు సరఫరా చేస్తారు. బాలసంజీవని ట్రైబల్‌ కింద గోధుమపిండి 2 కేజీలు, వేరుశనగ చిక్కీ 500 గ్రాములు, రాగిపిండి ఒక కేజీ, బెల్లం 500 గ్రాములు, ఎండు ఖర్జూరం 500 గ్రాములు నెలవారీగా సరఫరా చేయాల్సి ఉంది.

పోషకాహార నిపుణులు హెచ్చరించినా..

రాష్ట్రంలో 13.80 లక్షల మంది పిల్లలకు సరఫరా చేసే బాలామృతం విషయంలోనూ మహిళాశిశు సంక్షేమశాఖ గతేడాది సెప్టెంబరులో ఇదే విధంగా టెండర్ల ప్రక్రియను వివాదాస్పదంగా చేపట్టింది. అప్పటికే ఆ శాఖలో నాలుగు జోన్లలో గర్భిణులకు బాలసంజీవని సరఫరా చేసే కాంట్రాక్టర్లకే... పిల్లలకు బాలామృతం సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ సంస్థలు మాత్రమే టెండర్లకు అర్హత కలిగి ఉండేలా నిబంధనలు రూపొందించారు. న్యూట్రిషన్‌ పౌడర్‌/హెల్త్‌ మిక్స్‌ తయారీలో అనుభవం లేని సంస్థలకు కూడా అవకాశం కల్పించడం వల్ల శిశువుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరించినా టెండర్లలో మొండిగా ముందుకెళ్లారు. టెండర్‌ పొందిన తర్వాత 8 నెలల్లో కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిబంధనలు పెట్టడం ద్వారా న్యూట్రిషన్‌ రంగంలో పేర్కొందిన జాతీయ స్థాయి సంస్థలు పోటీ నుంచి తప్పుకుని, అనుభవం లేని కొత్త సంస్థలకు అవకాశం కలిగేలా చేశారు. నాడూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు రాసింది. కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లడంతో హైకోర్టు ఆ టెండర్లను నిలిపేసింది.

Updated Date - May 01 , 2026 | 04:13 AM