బాబే బ్రాండ్ అంబాసిడర్
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:53 AM
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
హిందూపురం పట్టుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తా: బాలకృష్ణ
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
హిందూపురం, ఫిబ్రవరి 19(ఆంద్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.8 కోట్లతో పట్టుగూళ్ల మార్కెట్ నిర్మాణం, మరో రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. హిందూపురంలో రూ.92 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణపనులను పరిశీలించారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే ఆయన రాష్ట్రానికి అంబాసిడర్ అన్నారు. దేశంలోనే అత్యధికంగా మల్బరీ సాగుచేసే ప్రాంతాల్లో హిందూపురం ఒకటన్నారు. ఇక్కడ పండించే పట్టుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చడానికే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారని వివరించారు. హిందూపురాన్ని ఆర్‌అండ్‌బీ డివిజన్‌గా ఏర్పాటుచేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, సెరీకల్చర్ అదనపు కమిషనర్ అరుణకుమారి, అధికారులు పాల్గొన్నారు.