Share News

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:46 AM

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

  • రాష్ట్రపతి ఆమోదం...

  • కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32గా ఉంది. న్యాయమూర్తిగా బాలాజీ నియామకంతో ఈ సంఖ్య 33కు చేరనుంది. న్యాయవాదుల కోటాలో న్యాయవాది బాలాజీ మెడమల్లి పేరును హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సమావేశమై బాలాజీ పేరుకు ఆమోదం తెలుపుతూ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. మెడమల్లి బాలాజీ గురు, శుక్రవారాల్లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

నేపథ్యం ఇదీ...

మెడమల్లి బాలాజీది వ్యవసాయ నేపఽథ్య కుటుంబం. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మించారు. ఆయన స్వస్థలం రాజంపేట మండలం, శేషన్నగారిపల్లి గ్రామం. తండ్రి సుబ్బయ్య నాయుడు కోపరేటీవ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. పాఠశాల విద్యను రాజంపేటలో పూర్తిచేసిన బాలాజీ... తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు. హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998 ఏప్రిల్‌ 9న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు ఆఫీసులో చేరి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. రాజ్యాంగ సంబంధ అంశాలతో పాటు సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు, కమర్షియల్‌ కేసుల వాదించడంలో బాలాజీకి అపార అనుభవం ఉంది. 2004 నుండి 2006 వరకు ఏజీ కార్యాలయానికి అటాచ్‌ అయ్యి ఏజీపీగా సేవలు అందించారు. 2018-19 మధ్య విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు, బ్యాంకులకూ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు.

Updated Date - Feb 11 , 2026 | 03:46 AM