Share News

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN , Publish Date - May 28 , 2026 | 05:20 AM

త్యాగం, విశ్వాసం, దానానికి ప్రతిరూపం బక్రీద్‌. రంజాన్‌ తరువాత ముస్లిం సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. పవిత్ర మక్కా యాత్ర ఈ బక్రీద్‌ ...

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

  • నగరంలో నేడు ప్రత్యేక నమాజ్‌

విజయవాడ సిటీ, మే 27, (ఆంధ్రజ్యోతి) : త్యాగం, విశ్వాసం, దానానికి ప్రతిరూపం బక్రీద్‌. రంజాన్‌ తరువాత ముస్లిం సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. పవిత్ర మక్కా యాత్ర ఈ బక్రీద్‌ పండుగ నెలలోనే ప్రారంభం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గురువారం ఈ పండుగను జరుపుకునేందుకు ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల వ్యాపితంగా ముస్లింలు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఈద్గాహ్‌, మసీదుల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క వేళలో బక్రీద్‌ పండుగ ప్రత్యేక నమాజ్‌ను పఠించనున్నారు. ఉదయం 6 గంటల సమయం మొదలుకుని 10 గంటల వరకూ ఇలా నగరంలో నమాజ్‌ వేళలను నిర్ణయించాయి మసీదు కమిటీ, ఈద్గాహ్‌ కమిటీలు. బక్రీద్‌ పర్వదిన విశిష్టతను ప్రభుత్వ ఖాజీ, బాబుల్‌ ఉలూం మస్జీద్‌ ఇమాం హాఫీజ్‌ షేక్‌ ముష్తాఖ్‌ హుస్సేన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. దైవానికి కావాల్సింది చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి. దీనిని చూడటం కోసమే అన్నట్లు దైవం సర్వ మానవాళికి వివిధ రూపాల్లో రకరకాల పరీక్షలు వస్తాయని అన్నారు.


1.jpg

  • ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు బహిరంగ నమాజ్‌

బక్రీద్‌ పండుగ సందర్భంగా గురువారం ఇందిరాగాంధీ స్టేడియం నందు బహిరంగ నమాజ్‌ నిర్వహిస్తున్నట్లు ముస్లీం ఈద్‌ గాహ్‌ కమిటీ తెలిపింది. బుధవారం స్టేడియంలో ఈద్‌ గాహ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈద్‌ నమాజ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహంచారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 28వ తేదీ గురువారం ఉదయం ఉదయం 6గంటలకు ఈద్‌ సందేశం, అనంతరం 6.30గంటలకు ఈదుల్‌ ఆద్హా నమాజ్‌ ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కాలేషావలి, జాయింట్‌ సెక్రటరీ ఇర్ఫాన్‌, అన్వర్‌, సయ్యద్‌ అలీం, ఫారూఖ్‌ షుబ్లీ, ముఖ్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 05:20 AM