రైలులో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:15 AM
రైలులో ఓ ప్రయాణికురాలి ప్రసవ వేదన సమాచారం తెలుసుకున్న విజయవాడ టీటీఐ (మౌలిక సదుపాయాలు), వెంటనే స్పందించి, మహిళకు సుఖవంతంగా కాన్పు చేయటంలో సహకరించారు.
రైల్వేస్టేషన్(విజయవాడ), ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రైలులో ఓ ప్రయాణికురాలి ప్రసవ వేదన సమాచారం తెలుసుకున్న విజయవాడ టీటీఐ (మౌలిక సదుపాయాలు), వెంటనే స్పందించి, మహిళకు సుఖవంతంగా కాన్పు చేయటంలో సహకరించారు. ఈ నెల 5న ఆదివారం (13352) అలప్పుజ-ధనబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు బీ1 కోచ్‌లో ఓ ప్రయాణికురాలు పురిటి నొప్పులతో ఇబ్బంది పడింది. ఆ సమయంలో రైలు అన్నవరం స్టేషన్ దాటింది. ఆమె కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న టికెట్ చెకింగ్ స్టాఫ్ సహాయాన్ని అర్ధించారు. వెంటనే వారు ఈ సమాచారాన్ని టీటీఐ జ్యోతికి చేరవేశారు. ఆమె వెంటనే స్పందించి ప్రయాణికురాలి ప్రసవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ మహిళ రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలుకు అత్యవసరంగా యలమంచిలి స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్ ఇచ్చారు. తల్లీ బిడ్డను 108 అంబులెన్స్ ద్వారా యలమంచిలి జీజీహెచ్‌కు తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.