యోగాంధ్రకు ముఖ్య అతిథిగా రాందేవ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:59 AM
రాష్ట్రస్థాయి యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
సీఎం ఆదేశాలతో హరిద్వార్‌కు బృందం
5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు
14-20 వరకు అన్ని పాఠశాలల భాగస్వామ్యం
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి యోగాంధ్ర-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో రాందేవ్ బృందానికి చెందిన వారితో పాటు వివిధ యోగా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆసనాలు వేయిస్తారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు యోగా, నేచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, ఆయుష్ అధికారులు హరిద్వార్ వెళ్లి రాందేవ్ ను ఆహ్వానించనున్నారని తెలిపారు.
భారీ స్పందన
యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 7 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా స్వల్ప వ్యవధిలోనే ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి రోజు 25 వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగా, సోమవారం నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు యోగాంధ్ర పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది పేర్లు నమోదయ్యాయని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.
యోగాంధ్రలో ఉపాధ్యాయులు, విద్యార్థులు
యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. యో గాంధ్రకు ముందు నిర్వహించే ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనాలని, దీనికి వ్యా యామ ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర కార్యక్రమాల్లో అందరూ పాల్గొనేలా చూడాలని పేర్కొంది.