చట్టసభల్లో యువతకూ రిజర్వేషన్ ఇవ్వాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:28 AM
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో 40ఏళ్ల లోపు వారికి కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న...
కొందరివల్లే రాజకీయాలపై వారిలో ఏవగింపు : అయ్యన్న
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో 40ఏళ్ల లోపు వారికి కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించారు. గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ పశ్చిమ ప్రాంత సదస్సులో ‘దేశాభివృద్ధిలో యువ శాసనకర్తల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘సగటు భారతీయుడి వయసు 32ఏళ్లు కాగా, లోక్‌సభ సభ్యుల సగటు వయసు 56, ఏపీ శాసనసభ్యుల సగటు వయసు 53 ఏళ్లుగా ఉంది. 18వ లోక్‌సభలో 40 ఏళ్ల లోపు యువత కేవలం 11 శాతం మాత్రమే ఉండగా, ఏపీ అసెంబ్లీలో ఇది 7 శాతానికే పరిమితమైంది. చట్టసభల్లో కొందరు శాసనసభ్యుల ప్రవర్తన కారణంగా యువత రాజకీయాలను ఏవగించుకుంటోంది. ఈ ధోరణి మారాలంటే రాజకీయ నాయకుల నడవడిక మారాలి. చట్టసభల్లో వారి ప్రవర్తన, పనితీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. విద్యార్థి దశలో రాజకీయాలకు దాదాపు తెరపడటం, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రాకపోవడం దీనికి ఒక కారణం. త్వరలో రాబోతున్న మహిళా రిజర్వేషన్ల తరహాలోనే, చట్టసభల్లో యువతకు సైతం రిజర్వేషన్లు కల్పించాలి. 1982లో ఎన్టీ రామారావు యువతకు అవకాశాలు కల్పించడం వల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నేను 25 ఏళ్లకే ఎమ్మెల్యేను కాగలిగాను. అవకాశం కల్పిస్తే యువత తప్పక రాణిస్తుంది’ అని అయ్యన్న అన్నారు.