మా కన్నీళ్లు ఇంకిపోయాయి
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:15 AM
18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత మాలో ఆశలు చచ్చిపోయాయి. కన్నీళ్లు ఇంకిపోయాయి. న్యాయం జరుగుతుందని ఏదో మూలన ఉన్న చిన్నపాటి ఆశ కూడా ఆవిరైపోయింది.
ఈ నెల 27న ఆయేషా శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాలనూ ఖననం చేస్తున్నాం
దోషులకు శిక్షపడలేదన్న ఆవేదన నిద్రపోనివ్వట్లేదు
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌పైనే చివరి ఆశలు
ఆయేషా మీరా సంస్మరణ దినంగా డిసెంబరు 27
ఆమె పేరుపై ప్రభుత్వమే ట్రస్ట్ ఏర్పాటు చేయాలి
సీఎం చంద్రబాబుకు ఆయేషా తల్లిదండ్రుల వినతి
తెనాలి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత మాలో ఆశలు చచ్చిపోయాయి. కన్నీళ్లు ఇంకిపోయాయి. న్యాయం జరుగుతుందని ఏదో మూలన ఉన్న చిన్నపాటి ఆశ కూడా ఆవిరైపోయింది. మా కుమార్తె శరీర భాగాలను కూడా కోర్టులో పోరాడి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 27న వాటితో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయేషా తల్లిదండ్రులు సంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ల పోరాటం తరువాత తమ నోటి వెంట వస్తున్న మాటలు చాలా సముచితమైనవేనని భావిస్తున్నామని తెలిపారు. తమ పోరాటం వృథా అయిపోయిందన్న బాధ కంటే తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన దోషులకు శిక్ష పడలేదన్న ఆవేదన నిద్రపోనివ్వడం లేదని వాపోయారు. ఈ కేసులో దోషులు తప్పించుకోవడానికి కీలక పాత్ర పోషించింది అధికారులేనని, వారిపై చర్యలు తీసుకునే విషయంలో కూడా న్యాయవ్యవస్థ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం కలచి వేస్తోందని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఏదో ఒక మూల న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండేదని, ఏళ్ల తరబడి విచారణ జరిపిన సీబీఐ నివేదికలోని దారుణాలు చూస్తే ఆ నమ్మకం కూడా పోయిందని అన్నారు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఖననం చేసిన మృతదేహం శరీర భాగాలను అప్పగించినా న్యాయం జరగకపోగా పది రోజుల్లో తామే ఆ భాగాలను అందిస్తామన్న సీబీఐ అధికారులు ఏడేళ్ల తరువాత మీరు వచ్చి తీసుకెళ్లమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం చూస్తే బాధితులమైన తమపై కంటే నేరం చేసినవారిపై ఎంత ప్రేమ చూపించారో అర్థమవుతోందని ఆరోపించారు.
తమ కుమార్తె శరీర భాగాలను అప్పగించేందుకు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తికి రుణపడి ఉంటామన్నారు. 27న వాటిని తెనాలి చెంచుపేట శ్మశాన వాటికలో ఖననం చేయనున్నట్లు చెప్పారు. దర్యాప్తు వ్యవస్థలన్నీ తమకు అన్యాయమే చేశాయని, చివరకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ వల్లే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. తమ కుమార్తె హత్యకు గురైన డిసెంబరు 27ను ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఆమె పేరుపై ప్రభుత్వమే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇటువంటి బాధితులను ఆదుకోవాలని సీఎంకు ఆయేషా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.