ఆయకట్టు రైతులు తొందరపడి విత్తుకోవద్దు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:52 PM
ఎల్‌ఎల్‌సీ ఆయకట్టు రైతులు తొందరపడి పత్తి, మిరప, వరినారుమళ్లు విత్తుకోవద్దని టీబీబీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్ సూచించారు.
- టీబీబీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్
హాలహర్వి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎల్‌సీ ఆయకట్టు రైతులు తొందరపడి పత్తి, మిరప, వరినారుమళ్లు విత్తుకోవద్దని టీబీబీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, జూలై వచ్చినప్పటికీ ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదన్నారు. ప్రతి ఏడాది జూన్‌లో ఇన్‌ఫ్లో ప్రారంభమై జూలై చివరికంతా జలాశయం 70 శాతం నీటితో కళకళలాడేదని, ప్రతియేటా జూలై 20 నాటికీ నీటిని ఎల్‌ఎల్‌సీ కాలువకు విడుదల చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఈ ఏడాది వరద ప్రభావం లేకపోవడం వల్ల జలాశయానికి వచ్చే నీటి లభ్యంత అంచనా వేయలేకపోతున్నామన్నారు. ఎగువన అనుకూలమైన వర్షాలు కురిస్తే వరద ఉదృతి పెరిగి జలాశయంలోకి నీరు వస్తే తప్పా ఏం చేయలేమన్నారు. అందువల్ల రైతులు తొందరపడి పత్తి, మిరప, వరినారు మళ్లు చల్లుకుని నష్టపోవద్దని ఆయన సూచించారు. 100టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 9 టీఎంసీ లు మాత్రమే నీరు ఉందన్నారు. ఇన్‌ఫ్లో జీరోగా ఉందని తెలిపారు. కానీ ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు 75శాతం ఆయకట్టు రైతులు పత్తి, మిరప విత్తనం పూర్తి అయ్యింది. ఎకరాకు రూ.10 వేల వరకు విత్తనం ఖర్చులు పెట్టుబడిగా పెట్టామని రైతులు అంటున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రభావం ఈనెల చివరిలోనైనా ప్రారంభమైతే తప్పా గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.