బాలల హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఏవీఎస్ బాధ్యతలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:18 AM
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యులుగా కేజీ వెంకట పద్మలత, ధోని శ్రీనివాసమూర్తి....
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యులుగా కేజీ వెంకట పద్మలత, ధోని శ్రీనివాసమూర్తి, ఉండవల్లి గాంధీబాబు, చల్లా మధుసూదనరావు, మండల గంగ సూర్యనారాయణ, పి.నాగ మానస బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సెక్రటరీ ఉమాదేవి సమక్షంలో వీరంతా బాధ్యతలు చేపట్టారు. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేస్తామని ఈ సందర్భంగా సూర్యనారాయణ రాజు చెప్పారు.
4 నుంచి సంక్షేమ కమిటీల ఇంటర్వ్యూలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జువెనైల్ జస్టిస్ బోర్డులు, బాలల సంక్షేమ కమిటీల్లో సభ్యులను నియమించడానికి ఏప్రిల్ 4 నుంచి 20వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమశాఖ సంచాలకులు వసంత బాల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ విజయవాడలోని బాలల సంక్షేమ, సంస్కరణల సేవల సంచాలకుల కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుందని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్వ్యూ పూర్తి షెడ్యూల్, అర్హులు, అనర్హులైన అభ్యర్థుల వివరాలను జ్ట్టిఞట://wdcw.ap.gov.in లో పొందుపరిచామన్నారు. అభ్యర్థులకు లెటర్స్, మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తామని తెలిపారు. ఆయా జిల్లాలకు కేటాయించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.