వ్యూహకర్త అతనే
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:26 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ-7) పాత్ర కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు తెలిపింది.
లిక్కర్ స్కామ్‌లో ముప్పిడి అవినాశ్ రెడ్డి కీలకం
తోడల్లుడు రాజ్‌కసిరెడ్డితో కలసి దందా
ముడుపులిచ్చిన బ్రాండ్లకే ఆర్డర్లు
ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు
ఒక్కో కేసుపై రూ.150-160 వసూలు
సొమ్ము మళ్లింపునకు నకిలీ ఇన్వాయి్‌సలు
బోగస్ బిల్లులతో 221 కోట్లు మళ్లింపు
సిట్ ఏర్పాటయ్యాక విదేశాలకు పరార్
రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
సుప్రీం ఆదేశాలతో లొంగుబాటు.. అరెస్ట్
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ-7) పాత్ర కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో గురువారం లొంగిపోయిన అవినాశ్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన పాత్రను రిమాండ్ రిపోర్టులో వివరించారు. సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికలు అవినాశ్ రెడ్డి పాత్రను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. తోడల్లుడైన ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(ఏ-1)తో కలిసి రూ.3,500 కోట్ల స్కాంలో కీలక భూమిక పోషించినట్లు వెల్లడించారు. ‘లిక్కర్ సిండికేట్‌కు అవినాశ్‌రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా ఉంటూ లావాదేవీలు నిర్వహించాడు. మద్యం ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేశాడు. ఆ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. ముడుపులు చెల్లించే మద్యం బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు దక్కేలా ఎక్సైజ్ అధికారులను నియంత్రించాడు’ అని సిట్ పేర్కొంది. పారదర్శకంగా ఉన్న ఆటోమెటిక్ విధానాన్ని, పాపులర్ బ్రాండ్లను తొలగించి, ఆ స్థానంలో ముడుపుల మద్యం సరఫరా కోసం ఆర్డర్ ఫర్ సేల్ నియంత్రించాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ప్రభుత్వ ఔట్‌లెట్లతో మద్యం అమ్మకాలను అవినాశ్ రెడ్డి నియంత్రించాడని పేర్కొంది. ముడుపుల రూపంలో సేకరించిన సొమ్మును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం, వ్యక్తిగత విలాసాల కోసం వినియోగించినట్లు తెలిపింది.
బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయని, మనీలాండరింగ్‌పై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అవినాశ్ రెడ్డి ఐఐటీ గ్రాడ్యుయేట్ యువకుల్ని ఎంపిక చేసుకుని మద్యం ముడుపుల వసూళ్ల బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. మద్యం ధర, బ్రాండు ఆధారంగా ఒక్కో మద్యం కేసుపై రూ.150 నుంచి రూ.600 వరకూ కమీషన్లు వసూలు చేసినట్లు తెలిపింది. అక్రమ సొమ్ము దారి మళ్లించేందుకు తప్పుడు ఇన్వాయి్‌సలు సృష్టించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్, తాడేపల్లి మధ్య ముడుపుల ఆర్థిక వ్యవహారాలను అవినాశ్ రెడ్డి సమన్వయం చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగానే 2025 ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌కు పారిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడని వివరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో లొంగిపోయిన నిందితుడు స్కామ్‌లో తన పాత్ర గురించి ప్రశ్నిస్తే సహకరించలేదని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
సుమిత్‌గా చెప్పుకొంటూ...
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశాల నుంచి ముడుపుల వసూలు వరకూ అవినాశ్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. 2019 అక్టోబరు 13న హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నాడు. మద్యం కొనుగోలు వ్యవస్థలో మార్పులు, ముడుపుల శాతం వసూలు, సరఫరాలో ఏకాధిపత్యంపై జరిగిన చర్చల్లోనూ పాల్గొన్నాడు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా అప్పటి ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు, సహనిందితులు వాసుదేవ రెడ్డి(ఏ-2), సత్యప్రసాద్ (ఏ-3)కు అవినాశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సిట్ తెలిపింది. ‘‘లిక్కర్ వ్యాపారులకు ఆర్డర్ కావాలంటే అవినాశ్‌ను కలవాలంటూ సత్యప్రసాద్, వాసుదేవ రెడ్డి చెప్పేవారు. ముడుపులు ఇస్తేనే ఆర్డర్లు ఇప్పిస్తానంటూ అవినాశ్ రెడ్డి కండీషన్ పెట్టేవాడు. అవినాశ్ తన పేరును సుమిత్‌గా చెప్పుకొంటూ ఆర్డర్ ఫర్ సేల్, ముడుపులిచ్చిన బ్రాండ్ల ఆర్డర్ల పెంపు-తగ్గింపులపై తీవ్ర ప్రభావం చూపాడు. రాజ్ కసిరెడ్డి(ఏ-1) ఆదేశాలతో మద్యం ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపాడు. మద్యం ఆర్డర్లు, తర్వాత ముడుపుల స్వీకరణకు ఆధారాలున్నాయి’’ అని సిట్ పేర్కొంది.
221.6 కోట్ల బోగస్ బిల్లులు
ఆదాన్ డిస్టిలరీస్ పై పూర్తి భాగస్వామ్య నియంత్రణ తో అవినాశ్‌రెడ్డి షెల్ కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి ముడుపులు భారీగా దారి మళ్లించినట్లు సిట్ వెల్లడించింది. ఆదాన్ అకౌంటెంట్ సాక్ష్యం ప్రకారం రూ.221.60 కోట్లను ఇలా మళ్లించినట్లు తెలిపింది. ముడుపుల సొమ్ముకు ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సంస్థల పేర్లపై సరుకు లేకుండానే బిల్లులు సృష్టించి... ఆ సొమ్మును పలు దశలు దాటించి తీసుకెళ్లాక రికార్డులు మాయం చేశాడని వివరించింది. కసిరెడ్డితో సమన్వయం చేసుకుని, నగదు రవాణా, కిక్ బ్యాక్స్ వసూళ్ల పర్యవేక్షణకు సంబంధించి ఫోన్ సంభాషణ, లొకేషన్ల డేటా, నగదు హ్యాండ్లర్ల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. 2025 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు కాగానే విదేశాలకు పారిపోయినట్లు తెలిపింది.