డేటా తెగ వాడేస్తున్నారుగా..!
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:10 AM
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్‌లో వీడియో స్ట్రీమింగ్ దగ్గర నుంచి సోషల్ మీడియా, వర్క్‌ఫ్రం హోం, డిజిటల్ చెల్లింపులు వరకూ అన్నింటికీ మొబైల్ డేటా కీలకమైంది.
ఏపీలో నెలకు సగటున 24.6 జీబీ డేటా వాడకం: పెమ్మసాని
అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్‌లో వీడియో స్ట్రీమింగ్ దగ్గర నుంచి సోషల్ మీడియా, వర్క్‌ఫ్రం హోం, డిజిటల్ చెల్లింపులు వరకూ అన్నింటికీ మొబైల్ డేటా కీలకమైంది. డేటా వాడకం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగానే ఉంది. కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన 4జీ టవర్ల ద్వారా ఏపీలో ఫిబ్రవరిలో ఒక్కో వినియోగదారుడు సగటున 24.6 జీబీల డేటా ఉపయోగించారని పార్లమెంటులో కేంద్రం తెలిపింది. 4జీ మొబైల్ టవర్ల ఏర్పాటుపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా మొబైల్ సేవలు లేని గ్రామాల్లో 4జీ సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా పలు ప్రాజెక్టులు చేపట్టింది. డీబీఎన్ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల కింద ఏపీలో 5,016 ప్రాంతాలను ఎంపిక చేశారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి డీబీఎన్ ప్రాజెక్టుల ద్వారా ఏపీలోకి 4జీ టవర్లు 2,035 వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కోసం ఏపీకి రూ.1182.88 కోట్లు విడుదలయ్యాయి. డీబీఎన్ నిధులతో ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల ద్వారా వినియోగదారులు మొత్తం 4,527 టెరాబైట్ (టీబీ)ల డేటాను వినియోగించారు. అంటే ఒక్క ఫిబ్రవరిలోనే ఒక్కో వినియోగదారుడు సగటున 24.6 జీబీ డేటాను ఉపయోగించారు’ అని మంత్రి వెల్లడించారు.