ఆర్టీవోల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆటోమేషన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:25 AM
డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆటోమేషన్‌తో డ్రైవింగ్ నైపుణ్యం కలిగిన వారికే లైసెన్స్‌లు జారీ అవుతాయని, రోడ్డు భద్రత మరింత బలోపేతం అవుతుందని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు.
మారుతీ సుజుకీతో రవాణా శాఖ ఒప్పందం
రోడ్డు భద్రత బలోపేతానికే: కమిషనర్ ఎంకే సిన్హా
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆటోమేషన్‌తో డ్రైవింగ్ నైపుణ్యం కలిగిన వారికే లైసెన్స్‌లు జారీ అవుతాయని, రోడ్డు భద్రత మరింత బలోపేతం అవుతుందని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. లైసెన్స్‌ల పరీక్షల ప్రక్రియలో మానవ జోక్యాన్ని తగ్గించి.. సమర్థత, నిష్పాక్షికతను పెంచడమే ఆటోమేషన్ ఏర్పాటు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (ఆర్టీవో) డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఆటోమేషన్ చేసేందుకు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎ్‌సఐఎల్)తో రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో కమిషన్ సిన్హా, మారుతీ సుజుకీ సీఎ్‌సఆర్ విభాగ అధిపతి తరుణ్ అగర్వాల్ దీనిపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మారుతీ సుజుకీ ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు సిన్హా తెలిపారు. ఏలూరు, ఒంగోలు, విజయనగరం, అనకాపల్లి ఆర్టీవో ప్రాంగణాల్లో ఏర్పాటు చేయబోయే ట్రాక్‌లలో సాంకేతిక సహకారం, సిబ్బంది శిక్షణను ఎంఎ్‌సఐఎల్ మూడేళ్ల పాటు చేపడుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, గన్నవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ప్రొద్దుటూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలులో ఆటోమేషన్ డ్రైవింగ్ ట్రాక్‌లు ఉన్నాయని కమిషనర్ చెప్పారు.