Auto Driver Brutally Beaten: ఆటోడ్రైవర్‌పై అమానుషం
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:48 AM
రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తికి ఆటో తగిలిందనే కారణంతో స్థానికులు ఆటోడ్రైవర్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదిన అమానుష ఘటన శుక్రవారం రాత్రి ప్రకాశం పామూరు మండలంలోని..
ఆటో తగిలిందని స్తంభానికి కట్టేసి చితకబాదిన వైనం, ఆరుగురి అరెస్ట్
పామూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తికి ఆటో తగిలిందనే కారణంతో స్థానికులు ఆటోడ్రైవర్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదిన అమానుష ఘటన శుక్రవారం రాత్రి ప్రకాశం పామూరు మండలంలోని బొట్లగూడూరులో జరిగింది. బాధితుడిని కట్టేసి కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ శనివారం పామూరు పోలీ్‌సస్టేషన్‌లో ఈ కేసు వివరాలను తెలిపారు. పీసీపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి శుక్రవారం రాత్రి నిమ్మకాయల లోడుతో ఆటోలో పామూరుకు వెళుతున్నాడు. బొట్లగూడూరు సెంటర్‌లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో మద్దినేని తిరుపతయ్య అనే వ్యక్తి తగలటంతో స్పల్ప గాయాలయ్యాయి. గమనించిన కొందరు మహర్షితో వాగ్వాదానికి దిగి ఆటో అద్దాలను పగులగొట్టారు. అతన్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో మహర్షికి ఎడమ చేతి వద్ద, కుడి కన్ను దగ్గర, నడుం భాగంలో రక్త్తగాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న పెద్దలు అతన్ని విడిపించగా మహర్షి నేరుగా పామూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం పామూరు ఆస్పత్రికి, ఆ తర్వాత కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు.